మిథాలీరాజ్ ఖాతాలో మరో చెత్త రికార్డు!

  • బంగ్లాతో మ్యాచ్ లో సున్నా పరుగులకే అవుట్
  • ప్రపంచకప్ లో రెండో డకౌట్ రికార్డు
  • ఆమె కెరీర్ లో ఇది ఏడో డకౌట్
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్ తన కెరీర్ లో మరో చెత్త రికార్డును మంగళవారం సొంతం చేసుకుంది. మహిళల ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మిథాలీరాజ్ ఒక్క పరుగు కూడా చేయకుండానే డకౌట్ అయి వెనుదిరిగింది. 

లీగ్ దశలో బంగ్లాదేశ్ తో భారత్ జట్టు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. ముందుకు వెళ్లాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్ ఇది. ప్రపంచకప్ లో మిథాలీరాజ్ కు ఇది రెండో గోల్డెన్ డక్ రికార్డు కావడం గమనార్హం. అవాంఛిత మహిళల ప్రపంచకప్ రికార్డుగా మిథాలీరాజ్ దీన్ని అభివర్ణించింది. 

ఈ విడత ప్రపంచకప్ లో మిథాలీరాజ్ ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. పాకిస్థాన్ తో 31 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ తో మ్యాచ్ లో కేవలం 5 పరుగులకే పెవిలియన్ చేరింది. వెస్టిండీస్ తో మ్యాచ్ లో ఒకే పరుగు సాధించింది. గత వారం ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో మంచి పనితీరు ప్రదర్శించి 68 పరుగులు సాధించింది. 

బంగ్లాదేశ్ మ్యాచ్ లో డకౌట్ అవడంతో.. మిథాలీరాజ్ తన కెరీర్ లో వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లలో ఏడో డకౌట్ అయినట్టయింది. చివరిగా 2017 ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లోనూ డకౌట్ అయింది.


More Telugu News