సల్మాన్ ఖాన్ జింకల వేట కేసు రాజస్థాన్ హైకోర్టుకు బదిలీ

  • సల్మాన్ ను ఇప్పటికీ వెంటాడుతున్న కృష్ణజింకల వధ కేసు
  • 1998లో ఘటన
  • 2018లో సల్మాన్ ను దోషిగా నిర్ధారించిన జోథ్ పూర్ కోర్టు
  • బెయిల్ పొందిన సల్మాన్ ఖాన్
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ను 1998 నాటి కృష్ణజింకల కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. తాజాగా ఈ కేసులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సల్మాన్ ఖాన్ జింకలవేట కేసును విచారించేందుకు రాజస్థాన్ హైకోర్టు అంగీకరించింది. ఈ మేరకు సల్మాన్ ఖాన్ దాఖలు చేసిన కేసు బదిలీ పిటిషన్ కు కోర్టు ఆమోదముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, ఈ కేసుకు సంబంధించి అన్ని పిటిషన్లపై ఇక రాజస్థాన్ హైకోర్టులోనే విచారణ జరుపుతారు. 

'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ రాజస్థాన్ లో జరిగిన సమయంలో సల్మాన్ తన సహనటులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్టు అభియోగాలు మోపారు. సల్మాన్ పై 9/51 ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 తో పాటు ఆయుధాల చట్టంలోని 3/25, 3/27 సెక్షన్లతో కేసు నమోదైంది. 

ఈ కేసులో సల్మాన్ ను దోషిగా నిర్ధారిస్తూ 2018లో జోథ్ పూర్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అయితే సల్మాన్ ఆ తర్వాత బెయిల్ పొందాడు. తొలుత ఈ కేసులో సల్మాన్ తో పాటు సైఫ్ ఆలీ ఖాన్, సోనాలీ బెంద్రే, నీలమ్, టబులపైనా చార్జిషీటు దాఖలైంది. పలు దఫాల విచారణ అనంతరం వారు నిర్దోషులుగా బయటపడ్డారు.


More Telugu News