బెజ‌వాడ‌, హైద‌రాబాద్ ఎక్స్‌ప్రెస్‌హైవేకు పార్ల‌మెంటులో కేశినేని డిమాండ్‌

  • ఎక్స్‌ప్రెస్ హైవేపై విభ‌జ‌న చ‌ట్టంలోనే హామీ
  • బెజ‌వాడ‌-హైద‌రాబాద్ రోడ్డును 6 వ‌రుస‌ల రోడ్డుగా మార్చాలి
  • హైద‌రాబాద్ ర‌హ‌దారిని నేరుగా అమ‌రావతికి క‌ల‌పాలన్న నాని 
పార్ల‌మెంటు బ‌డ్జెట్ మ‌లి విడ‌త స‌మావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ప‌లువురు ఎంపీలు ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం నాటి లోక్ స‌భ స‌మావేశాల్లో భాగంగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్‌ల మ‌ధ్య ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణాన్ని త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా కేశినేని నాని అందుకు సంబంధించి ప‌లు కీల‌క అంశాల‌ను కూడా ప్ర‌స్తావించారు. ఈ హైవే నిర్మాణానికి సంబంధించి విభ‌జ‌న చ‌ట్టంలోనే హామీ ఇచ్చార‌ని కేశినేని గుర్తు చేశారు. విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ మ‌ధ్య ఉన్న 65వ నెంబ‌రు జాతీయ ర‌హ‌దారిని 6 వ‌రుస‌ల రోడ్డుగా మ‌ల‌చాల‌ని కూడా ఆయ‌న కోరారు. అంతేకాకుండా హైద‌రాబాద్ ర‌హ‌దారిని నేరుగా అమ‌రావ‌తికి క‌లిపే విధంగా ఇబ్ర‌హీంప‌ట్నం ప‌విత్ర సంగ‌మం వ‌ద్ద నుంచి కృష్ణా న‌దిపై వంతెన నిర్మించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News