పెగాస‌స్ పై ఏ విచార‌ణ‌కైనా సిద్ధం: నారా లోకేశ్

  • పెగాస‌స్ వ్య‌వ‌హారంపై మండ‌లిలో చ‌ర్చ‌
  •  కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ కూడా చెప్పారన్న లోకేశ్ 
  • వైఎస్ వివేకా హ‌త్య‌పై విచార‌ణ‌కు క‌మిటీ వేస్తారా? అంటూ ప్ర‌శ్న‌
ఏపీలో గ‌త కొన్ని రోజులుగా రాజ‌కీయ దుమారం రేపుతున్న పెగాస‌స్ సాఫ్ట్ వేర్ కొనుగోలు వివాదంపై టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి నారా లోకేశ్ ప్ర‌క‌ట‌న చేశారు. పెగాస‌స్‌పై హౌస్ కమిటీ, జ్యుడీషియరీ కమిటీ, సీబీఐ విచారణ.. ఇలా దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం నాడు శాస‌న‌మండలిలో వైసీపీ ప్ర‌తిపాదించిన మేర‌కు పెగాస‌స్ వ్య‌వ‌హారంపై స్వ‌ల్పకాలిక చ‌ర్చ‌కు మండ‌లి చైర్మ‌న్ అనుమ‌తి ఇచ్చిన నేపథ్యంలో లోకేశ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

అదే స‌మ‌యంలో ఆయ‌న వైసీపీకి ఓ స‌వాల్ కూడా విసిరారు. వైఎస్ వివేకానంద‌రెడ్డి హత్య, ప‌శ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మరణాల విషయాల్లో వైసీపీ ప్రభుత్వం విచారణకు కమిటీ వేయగలదా? అని ప్రశ్నించారు. పెగాసస్‌పై మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా? లేదా? అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేద‌న్న లోకేశ్.. పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ ఆర్టీఐ దరఖాస్తుదారుకు ఇచ్చిన స‌మాధానాన్ని గుర్తు చేశారు. వ్యక్తులకు గానీ, ప్రైవేట్ సంస్ధలకు గానీ పెగాసస్ సాఫ్ట్ వేర్ అమ్మలేదని ఇజ్రాయిల్ అంబాసిడర్ ప్రకటన కూడా చేశారని లోకేశ్ తెలిపారు.


More Telugu News