అవినీతి ర‌హిత రాష్ట్రమే ల‌క్ష్యం.. మ‌ణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌

  • వ‌రుస‌గా రెండో సారి మ‌ణిపూర్ సీఎంగా బీరేన్‌
  • మొన్న‌టి ఎన్నిక‌ల్లో బీజేపీ ఘ‌న విజ‌యం
  • బీరేన్‌కే సీఎం ప‌గ్గాలు అప్ప‌గించిన జాతీయ నాయ‌కత్వం
మ‌ణిపూర్ సీఎంగా మ‌రోమారు బీజేపీ నేత బీరేన్ సింగ్ సోమ‌వారం ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు. మ‌ణిపూర్ రాజ‌ధాని ఇంపాల్‌లో రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన త‌ర్వాత ఆయ‌న మీడియాతో మాట్లాడారు. అవినీతి లేని రాష్ట్రంగా మ‌ణిపూర్‌ను తీర్చిదిద్దేందుకు రాత్రి ప‌గ‌లు కష్ట‌ప‌డ‌తాన‌ని ఆయ‌న శ‌ప‌థం చేశారు. రాష్ట్రంలో మాద‌క ద్రవ్యాల వినియోగం అన్న మాటే వినబ‌డ‌కుండా చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. తిరుగుబాటుదారులంద‌రినీ ఓ చోట కూర్చోబెట్టి వారితో చ‌ర్చించి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేలా చేస్తాన‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. 

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో భాగంగా మ‌ణిపూర్ అసెంబ్లీకి కూడా ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌టికే ఆ రాష్ట్రంలో బీజేపీ పాల‌న సాగుతుండ‌గా.. బీరేన్ సింగ్ సీఎంగా వ్య‌వ‌హ‌రించారు. ఫ‌లితాల్లో మ‌ణిపూర్‌లో బీజేపీ మ‌ళ్లీ పాగా వేసింది. దీంతో మ‌రోమారు బీరేన్ సింగ్‌నే సీఎంగా ఎంపిక చేస్తూ బీజేపీ జాతీయ నాయ‌కత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో సోమ‌వారం బీరేన్ వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం మ‌ణిపూర్ సీఎంగా ప‌ద‌వీ ప్ర‌మాణం చేశారు.


More Telugu News