నిద్రలో కూడా ఎంఐఎంతో పొత్తు మాకొద్దు.. అది బీజేపీ కుట్ర: ఉద్ధవ్ థాకరే మండిపాటు
- బీజేపీ బీ టీమ్ ఎంఐఎం
- ఔరంగజేబు సమాధుల వద్ద తలవంచే వారితో పొత్తు ఉండదు
- అది బీజేపీ గేమ్ ప్లాన్
- నిప్పులు చెరిగిన మహారాష్ట్ర సీఎం
బీజేపీతో పోరాటానికి తమతో కలసి రావాలంటూ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఇచ్చిన పిలుపు పట్ల శివసేన అధినేత, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తీవ్రంగా స్పందించారు. ‘నిద్రలో కూడా మీతో మాకు పొత్తు కలవందటూ’ తేల్చేశారు. ఎంఐఎంను కాషాయ పార్టీ బీ టీమ్ గా ఆయన అభివర్ణించారు.
ఆదివారం రాత్రి శివసేన పార్టీ ఎంపీలు, ఇతర శ్రేణులను ఉద్దేశించి థాకరే మాట్లాడారు. సేనను హిందుత్వ పార్టీగా ఆయన పేర్కొన్నారు. జట్టు కడదామన్న ఎంఐఎం ఆఫర్ బీజేపీ పన్నిన కుట్రలో భాగమని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కేవలం రాజకీయ లబ్ధి కోసమే హిందుత్వాన్ని వాడుకుంటోందన్నారు.
‘‘ఎంఐఎంతో ఎవరు కూటమి కోరుకున్నారు? ఇది గేమ్ ప్లాన్. బీజేపీ కుట్ర. ఎంఐఎం, బీజేపీ మధ్య రహస్య అవగాహన ఉంది. శివసేనను అప్రదిష్ఠ పాలు చేయాలని, సేన హిందుత్వంపై ప్రశ్నలు సంధించాలని బీజేపీయే ఎంఐఎంకు సూచించి ఉంటుంది. దాంతో ఎంఐఎం నేతలు ఇలా ఆఫర్లు ఇస్తున్నారు’’ అంటూ విరుచుకుపడ్డారు.
బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ పార్టీ శివసేన ఆధ్వర్యంలోని మహా వికాస్ అఘాడీతో కూటమి కట్టేందుకు సిద్దంగా ఉన్నట్టు జలీల్ ప్రకటించడం గమనార్హం. దీనిపై థాకరే స్పందిస్తూ.. ఔరంగజేబు సమాధి ముందు తలవంచుకునే వారితో తాము ఎప్పటికీ జట్టు కట్టబోమని తేల్చి చెప్పారు.
శివసేనను జనాబ్ సేనగా పిలవడం పట్ల ఆర్ఎస్ఎస్, బీజేపీపైనా ఆయన నిప్పులు చెరిగారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేరు చివరన ఖాన్ లేదా జనాబ్ చేర్చాలా? అని ప్రశ్నించారు. పాకిస్థాన్ అనుకూల చర్యలు ఎవరి హయాంలో ఎన్ని జరిగాయో చూస్తూనే ఉన్నామంటూ.. వారిని పాకిస్థాన్ జనతా పార్టీ, హిజ్బుల్ జనతా పార్టీగా పిలవాలా? అని ఉద్ధవ్ ప్రశ్నించారు.