కర్ణాటక హైకోర్టు సీజే సహా జడ్జిలకు వై కేటగిరీ భద్రత.. ప్రతిపక్షాలపై సీఎం బసవరాజ్ మండిపాటు

  • దర్యాప్తు బాధ్యతలు డీజీపీకి అప్పగింత
  • ప్రతిపక్ష నేతలు కుహనా లౌకికవాదులని సీఎం ఆగ్రహం
  • నాలుగు రోజులవుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్న
  • అదే అసలైన మతతత్వమంటూ మండిపాటు
కర్ణాటక హైకోర్టు జడ్జిలకు రాష్ట్ర ప్రభుత్వం ‘వై’ కేటగిరి భద్రతను కల్పించింది. హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ ఇటీవల చీఫ్ జస్టిస్ రీతూ రాజ్ అవస్థి నేతృత్వంలోని ముగ్గురు జడ్జిలు తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారిని చంపేస్తామంటూ తమిళనాడుకు చెందిన వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే వారికి పటిష్ఠ భద్రతను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

కాగా, ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలంతా కుహనా లౌకికవాదులని ఆగ్రహం వ్యక్తం చేశారు. జడ్జిలను బెదిరించిన ఘటనపై ఇంత వరకు ఎవ్వరూ ఖండించలేదని విమర్శించారు. ‘‘జడ్జిలను బెదిరించిన ఘటన జరిగి మూణ్నాలుగు రోజులవుతున్నా ఈ కుహనా లౌకికవాదులు ఎందుకు మాట్లాడడం లేదు? ఓ వర్గం వారిని మెప్పించేందుకే నోరు మూసుకున్నారా? అది నిజమైన లౌకికవాదం కాదు. అదే అసలైన మతతత్వం’’ అని మండిపడ్డారు. 

బెదిరింపు ఘటనపై దర్యాప్తులో స్వయంగా పాల్గొనాల్సిందిగా డీజీపీని ఆయన ఆదేశించారు. తమిళనాడు పోలీసులతో కలిసి విచారణను సమన్వయం చేసుకోవాలని సూచించారు.


More Telugu News