ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కొత్త రకం కాదు.. మనల్ని ముందే పలకరించింది

  • బ్రిటన్, చైనా, దక్షిణ కొరియాలో బీఏ2 కేసులు
  • ఒమిక్రాన్ లో ఇదొక ఉపరకం
  • స్టెల్త్ వేరియంట్ గా పేరు
  • ర్యాపిడ్ యాంటీజెన్, ఆర్టీపీసీఆర్ పరీక్షలకు చిక్కదు
కరోనాలో ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో ముఖ్యంగా రెండు నెలల పాటు జనవరి - ఫిబ్రవరి మధ్య ఎక్కువ కేసులకు కారణం అయింది. ఒమిక్రాన్ లోనే బీఏ1, బీఏ2, బీఏ3 అనే మూడు ఉపరకాలు కూడా ఉన్నాయి. బీఏ2ను స్టెల్త్ వేరియంట్ గా చెబుతారు. ఇది సాధారణ పరీక్షలకు చిక్కదు. జీనోమ్ సీక్వెన్సింగ్ తోనే తెలుస్తుంది. అందుకనే దీనికి స్టెల్త్ వేరియంట్ అని పేరు పెట్టారు. 

ప్రపంచవ్యాప్తంగా చైనా, దక్షిణ కొరియా, సింగపూర్, బ్రిటన్ తదితర దేశాల్లో ఇప్పుడు విజృంభిస్తోంది ఒమిక్రాన్ స్టెల్త్ వేరియంట్ అయిన బీఏ2 రకమే. కనుక ఇది కొత్త వేరియంట్ కాదు. తమిళనాడు ప్రజారోగ్య విభాగం తాజాగా చేసిన ఒక ప్రకటన కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది. 2022 జనవరి నుంచి మార్చి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నమూనాలను జీనోమ్ సీక్వెనింగ్స్ పరీక్షకు పంపగా.. 18.4 శాతం నమూనాలు ఒమిక్రాన్ ఉప వేరియంట్ అయిన బీఏ2గా వెల్లడైంది. 

ఇక బీఏ 1.1 రకం 43 శాతం నమూనాల్లో బయటపడింది. మరో ఉపరకం బీఏ1, 37.3 శాతం శాంపిల్స్ లో గుర్తించారు. రాష్ట్రంలో కేసుల వ్యాప్తిలో ఎక్కువ పాత్ర ఒమిక్రాన్ రకం రూపంలోనే ఉన్నట్టు తమిళనాడు రాష్ట్ర ప్రజారోగ్య విభాగం ప్రకటించింది. 6.6 శాతం కేసులు డెల్టా వేరియంట్ రకానికి చెందినవిగా జీనోమ్ సీక్వెన్సింగ్ తో తెలిసింది. ఈ గణాంకాలు ప్రజలకు అవగాహన కల్పించేందుకే గానీ, భయపెట్టడానికి కాదని ప్రజారోగ్య విభాగం కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు.


More Telugu News