ఎన్నో రకాలుగా మోసపోయా: జన్మదిన వేడుకల్లో నటుడు మోహన్‌బాబు ఆవేదన

  • తిరుపతిలోని శ్రీవిద్యా నికేతన్‌లో మోహన్‌బాబు బర్త్ డే వేడుకలు
  • ముఖ్య అతిథులుగా పండిట్ రవిశంకర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • జీవితమంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోందని వ్యాఖ్యలు
టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు జన్మదిన వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని తన శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో జరిగిన ఈ వేడుకలకు ఆర్ట్‌ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పండిట్ రవిశంకర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, జీఏఆర్ గ్రూప్స్ అధినేత అమరనాథ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మంచు విష్ణు, మనోజ్, లక్ష్మీప్రసన్న, నరేష్, అలీ తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆవేదనా భరిత వ్యాఖ్యలు చేశారు. తాను ఎంతోమందికి ఉపయోగపడ్డానని, తనకు మాత్రం ఎవరూ ఉపయోగపడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో ఎంతోమంది ఎన్నికల ప్రచారం చేయించుకున్నారని, కానీ తనకు మాత్రం ఎవరూ ఏమీ చేయలేదన్నారు. తాను ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని అన్నారు. జీవితమంటే ఏంటో ఇప్పుడు తెలుస్తోందని చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. 30 ఏళ్ల క్రితం తాను స్థాపించిన శ్రీవిద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నేడు యూనివర్సిటీ స్థాయికి ఎదగడం వెనక ఎంతో శ్రమ ఉందని మోహన్‌బాబు అన్నారు. 

పండిట్ రవిశంకర్ మాట్లాడుతూ.. మోహన్‌బాబు త్వరలో ప్రారంభించబోయే యాక్టింగ్ స్కూలుకు అంతర్జాతీయ గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మోహన్‌బాబు ముక్కుసూటి మనిషని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. దీని వల్ల ఆయన ఎన్నో కోల్పోయారని అయితే, మరికొన్నింటిని మాత్రం ఆయన సంపాదించుకున్నారని పేర్కొన్నారు.


More Telugu News