కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మాట్లాడుతుండగా వేదికపైకి దూసుకొచ్చిన వ్యక్తి... రాజమౌళి ఆగ్రహం

  • చిక్కబళ్లాపూర్ లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ వేడుక
  • ముఖ్య అతిథిగా సీఎం బసవరాజ్ బొమ్మై
  • రాజమౌళి తమ ఊరు వాడేనన్న సీఎం
  • రాజమౌళి ఓ క్రియేటర్ అని కితాబు
ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్ణాటక, ఏపీ సరిహద్దుల్లోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చీఫ్ గెస్టుగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి దూసుకొచ్చాడు. ఈ హఠాత్పరిణామంతో బొమ్మై ప్రసంగం ఆపేయగా, రాజమౌళి ఆ వ్యక్తి పట్ల ఆగ్రహం ప్రదర్శించారు. ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని దొరకబుచ్చుకుని వేదిక నుంచి తరలించారు.

అంతకుముందు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రసంగిస్తూ... రాజమౌళిది తమ ఊరేనని, రాయచూరు అని వెల్లడించారు. అదే విధంగా, తారక్ కూడా కర్ణాటకతో అనుబంధం ఉన్నవాడేనని తెలిపారు. ఇక, రామ్ చరణ్ తండ్రి చిరంజీవి కర్ణాటకలో కూడా మెగాస్టార్ అని పేర్కొన్నారు. 

ఈ చిత్రంలో తనను ఆకట్టుకున్న అంశం స్వాతంత్ర్య పోరాటమేనని అన్నారు. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం వారిలో కన్నడ గడ్డకు చెందిన కిత్తూరు రాణి చెన్నమ్మ మొదటి మహిళ అని సీఎం బసవరాజ్ బొమ్మై వెల్లడించారు. రాజమౌళి స్వాతంత్ర్య సమరయోధుల అంశాన్ని ప్రస్తావిస్తూ సినిమా తీయడాన్ని అభినందిస్తున్నానని తెలిపారు. రాజమౌళి ఓ క్రియేటర్ అని, తన సినిమాల ద్వారా ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంటారని కొనియాడారు.


More Telugu News