తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం కన్నుమూత

  • కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
  • 13 ఏళ్లకే సాయుధ పోరాటంలోకి వెళ్లిన స్వరాజ్యం
  • తుపాకీ పట్టిన తొలి మహిళగా ఖ్యాతి
  • రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వైనం
  • రేపు నల్గొండలో అంత్యక్రియలు
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం ఈ సాయంత్రం కన్నుమూశారు. హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. మల్లు స్వరాజ్యం 13 ఏళ్ల వయసులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. నాటి సాయుధ పోరాటంలో తుపాకీ చేతబూనిన తొలి మహిళ మల్లు స్వరాజ్యమే. 

మల్లు స్వరాజ్యం 1931లో కొత్తగూడెంలో జన్మించారు. వామపక్ష దిగ్గజం భీంరెడ్డి నర్సింహారెడ్డికి ఆమె స్వయానా సోదరి. ఆమెకు మల్లు వెంకటనర్సింహారెడ్డితో వివాహం జరిగింది. చరిత్రకెక్కిన తెలంగాణ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం రజాకార్ల పాలిట సింహస్వప్నంలా నిలిచారు. అప్పట్లోనే ఆమె తలపై రూ.10 వేల రివార్డు ప్రకటించారు.'నా మాటే తుపాకీ తూటా' పేరిట ఆత్మకథ కూడా రాశారు. రాజకీయాల్లో ప్రవేశించిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

కాగా, ఆమె భౌతికకాయాన్ని రేపు ఉదయం 6 గంటలకు సీపీఎం కార్యాలయానికి తీసుకురానున్నారు. ఉదయం 10 గంటల వరకు కార్యకర్తల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. ఆపై నల్గొండకు తరలిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు నల్గొండలో ఆమె భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్లు స్వరాజ్యం అంత్యక్రియలకు సీపీఎం జాతీయ కౌన్సిల్ సభ్యులు హాజరవుతారని తెలుస్తోంది. మల్లు స్వరాజ్యం మృతిపట్ల వామపక్ష నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, నారాయణ, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.


More Telugu News