ఇటీవల అభివృద్ధి చేసిన హైపర్ సోనిక్ మిస్సైళ్లను ఉక్రెయిన్ పై ప్రయోగించిన రష్యా

  • ఉక్రెయిన్ పై రష్యా ముప్పేట దాడులు
  • మూడు వారాలుగా చేస్తున్న యుద్ధం ముమ్మరం
  • ఫలితం లేకపోవడంతో తీవ్ర అసహనంతో ఉన్న రష్యా
  • తాజాగా అత్యాధునిక 'కింజాల్' మిస్సైళ్లతో దాడులు
ఉక్రెయిన్ పై మూడు వారాలుగా చేస్తున్న దాడులు ఏమాత్రం ఫలితాన్నివ్వకపోగా, చేజిక్కించుకున్న ప్రాంతాలు సైతం పట్టుజారిపోతుండడం పట్ల రష్యా తీవ్ర అసహనంతో ఉంది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ పై ముప్పేట దాడులకు శ్రీకారం చుట్టిన రష్యా, తాజాగా మరో కీలక అస్త్రాన్ని ఉక్రెయిన్ పై ప్రయోగించింది. 

ఇటీవలే అభివృద్ధి చేసిన 'కింజాల్' హైపర్ సోనిక్ క్షిపణులను పశ్చిమ ఉక్రెయిన్ లోని ఓ ఆయుధాగారాన్ని ధ్వంసం చేసేందుకు తొలిసారిగా ఉపయోగించింది. యుద్ధరంగంలో రష్యా 'కింజాల్' హైపర్ సోనిక్ క్షిపణులను గతంలో ఎన్నడూ, ఎక్కడా ప్రయోగించలేదు. ఈ మేరకు రష్యా అధికారిక మీడియా సంస్థ 'ఆర్ఐఏ నొవోస్తి' పేర్కొంది. 

ఇవనో-ఫ్రాంకివ్ స్క్ ప్రాంతంలోని డెలియాటిన్ గ్రామంలో ఓ ఆయుధాగారంలో ఉక్రెయిన్ క్షిపణులను, గగనతల ఆయుధ వ్యవస్థల పేలుడు పదార్థాలను దాచి ఉందన్న సమాచారంతో రష్యా తాజా దాడులు చేపట్టింది. ఈ దాడుల్లోనే 'కింజాల్' హైపర్ సోనిక్ ఏరో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. 

'కింజాల్' అంటే రష్యన్ భాషలో 'చురకత్తి' అని అర్థం. దీన్ని గగనతలం నుంచి భూతల లక్ష్యాలను ఛేదించడానికి ఉపయోగిస్తారు. వీటిని రష్యా తన మిగ్-31కే, టీయూ-22ఎం3, సుఖోయ్-57 యుద్ధ విమానాలకు అమర్చింది.

కాగా, గతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ అత్యాధునిక క్షిపణి గురించి మాట్లాడుతూ, గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా, ధ్వనివేగం కంటే 10 రెట్ల అధిక వేగంతో ప్రయాణించే ఆ క్షిపణి సరైన ఆయుధం అని అభివర్ణించారు.


More Telugu News