నూజివీడులో ఉద్రిక్తత... టీడీపీ నేత ముద్దరబోయిన అరెస్ట్, వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావుకు గృహనిర్బంధం

  • నూజివీడు అభివృద్ధిపై మాటల యుద్ధం
  • వైసీపీ వర్సెస్ టీడీపీ
  • గాంధీ బొమ్మ కూడలిలో చర్చకు సవాల్
  • గాంధీ బొమ్మ వద్దకు వచ్చిన ముద్దరబోయిన
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
కృష్ణా జిల్లా నూజివీడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నూజివీడు అభివృద్ధిపై గత 10 రోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా, ఇక్కడి గాంధీ బొమ్మ కూడలిలో నేటి సాయంత్రం బహిరంగ చర్చకు ఇరుపక్షాల నేతల పరస్పర సవాళ్లు విసురుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావును అరెస్ట్ చేశారు. వైసీపీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావును గృహనిర్బంధంలో ఉంచారు. బహిరంగ చర్చకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. 

టీడీపీ, వైసీపీ మధ్య ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని నూజివీడులో 144 సెక్షన్ విధించారు. 400 మందికి పైగా పోలీసులతో నూజివీడు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో టీడీపీ నేత ముద్దరబోయిన నిన్నటి నుంచే అజ్ఞాతంలో ఉన్నారు. అయితే బహిరంగ చర్చకు వస్తానన్న మాటకు కట్టుబడి ఆయన గాంధీ బొమ్మ కూడలి వద్దకు వచ్చారు. దాంతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


More Telugu News