అప్పులు ఇచ్చేవాళ్లయినా ఎన్నిసార్లు ఇస్తారు?: వైసీపీ సర్కారుపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు

  • కడపలో రాయలసీమ రణభేరి సభ
  • హాజరైన కిషన్ రెడ్డి
  • సీమ సమస్యలపై ఎలుగెత్తింది బీజేపీయేనన్న కిషన్ రెడ్డి
  • రాష్ట్రం అప్పుల ఆంధ్రగా మారిందని విమర్శలు
కడపలో బీజేపీ ఏర్పాటు చేసిన రాయలసీమ రణభేరి సభకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, రాయలసీమ సమస్యలపై ఎలుగెత్తిన మొదటి పార్టీ బీజేపీయేనని ఉద్ఘాటించారు. రాయలసీమను అభివృద్ధి చేసేందుకు జెండా ఎత్తి పోరాడిన మొట్టమొదటి పార్టీ బీజేపీ అని అన్నారు. రాయలసీమకు కేంద్రం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. మోదీ నాయకత్వంలో రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమలో అనేక ప్రాజెక్టులు రూపుదాల్చాయని అన్నారు. 

రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు జగన్ ఏంచేశారో చెప్పాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పుల ఆంధ్రగా మారిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుందని వివరించారు. స్కూళ్లు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు ఏవీ నిర్మించలేరని తెలిపారు. అప్పులు ఇచ్చేవాళ్లయినా ఎన్నిసార్లు ఇస్తారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాయలసీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు అయ్యారని, కానీ సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యమే ఈ ప్రాంత వెనుకబాటుకు కారణమని పేర్కొన్నారు.


More Telugu News