ఐసీసీ వరల్డ్ కప్: కీలక మ్యాచ్ లో ఓడిపోయిన భారత మహిళలు

  • ఆక్లాండ్ లో మ్యాచ్
  • 6 వికెట్ల తేడాతో గెలిచిన ఆసీస్
  • 278 పరుగుల లక్ష్యాన్ని 49.3 ఓవర్లలో ఛేదించిన వైనం
  • సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్న ఆసీస్
  • తదుపరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఆడనున్న భారత్
న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వరల్డ్ కప్ లో నేడు టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఆక్లాండ్ లో జరిగిన ఈ పోరులో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యేవి. భారత మహిళలు నిర్దేశించిన 278 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 

ఈ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించినప్పటికీ ఆసీస్ నే విజయం వరించింది. మహిళల వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ లక్ష్యఛేదన. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా మహిళలు వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరుకున్నారు. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 68, యస్తికా భాటియా 59, హర్మన్ ప్రీత్ కౌర్ 57 పరుగులు చేశారు. ఆఖరి ఓవర్లలో పూజా వస్త్రాకర్ వేగంగా ఆడి 34 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో ఆసీస్ ఎంతో సానుకూలంగా ఆడి భారత బౌలర్లపై సమయానుకూలంగా ఎదురుదాడి చేస్తూ స్కోరుబోర్డును నడిపించింది. ముఖ్యంగా, కెప్టెన్ మెగ్ లానింగ్ 13 ఫోర్లతో 97 పరుగులు చేసి ఆస్ట్రేలియా విజయంలో కీలకపాత్ర పోషించింది. 

అంతకుముందు ఓపెనర్లు అలీసా హీలీ (65 బంతుల్లో 72), రాచెల్ హేన్స్ (42 పరుగులు) తొలి వికెట్ కు 121 పరుగులతో శుభారంభం అందించారు. వారు అవుటైన తర్వాత ఆల్ రౌండర్ ఎలిస్ పెర్రీ (28), బెత్ మూనీ (30 నాటౌట్)లతో కలిసి మెగ్ లానింగ్ జట్టును గెలుపు దిశగా నడిపించింది. 

కాగా, భారత్ తన తదుపరి మ్యాచ్ ను ఈ నెల 22న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడి 2 విజయాలు సాధించింది. ఇప్పటికే సెమీస్ లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు బెర్తులను ఖరారు చేసుకున్నాయి. మిగతా రెండు బెర్తుల కోసం భారత్, వెస్టిండీస్, న్యూజిలాండ్ మధ్య పోటీ నెలకొంది.


More Telugu News