బ్యాంకు ఉద్యోగుల మానవీయత.... లోన్ రికవరీకి వెళ్లిన వాళ్లే అప్పు తీర్చిన వైనం

  • ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్న శశి
  • బ్యాగుల పరిశ్రమ కోసం రుణం
  • వడ్డీతో కలిపి రూ.70 వేలకు పెరిగిన అప్పు
  • పక్షవాతానికి గురైన శశి
  • శిథిలావస్థకు చేరిన ఇంటిలో దయనీయ జీవనం
తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు వారు ఆస్తులు జప్తు చేస్తారన్న సంగతి తెలిసిందే. కేరళలోని కోజికోడ్ జిల్లా కప్పాడ్ కు చెందిన శశి బ్యాగుల తయారీ పరిశ్రమ స్థాపించేందుకు ఎస్బీఐ నుంచి రూ.50 వేల రుణం తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు శశి పక్షవాతానికి గురికావడంతో ఆర్థిక పరిస్థితి క్షీణించింది. ఇటు బ్యాంకు నుంచి తీసుకున్న రుణానికి వడ్డీ కలిపి రూ.70 వేలు అయింది. నిర్దేశిత సమయంలోపు శశి బ్యాంకు వారికి అప్పు చెల్లించలేకపోయాడు.

దాంతో ఎస్బీఐ అధికారులు శశి ఇంటిని జప్తు చేసేందుకు వెళ్లగా అక్కడి పరిస్థితులు చూసి వారి హృదయం ద్రవించిపోయింది. పక్షవాతంతో బాధపడుతున్న శశి పరిస్థితి, కూలిపోయే స్థితిలో ఉన్న పాత ఇల్లు, వృద్ధురాలైన అతడి తల్లి దీన స్థితి వారిని కదిలించివేశాయి. ఎప్పుడు కూలిపోతుందో తెలియని ఆ ఇంట్లోనే శశి అనారోగ్యంతో బతుకీడుస్తున్న దృశ్యం వారిలోని మానవీయతను తట్టిలేపింది. 

శశి బ్యాంకుకు చెల్లించాల్సిన రూ.70 వేలను ఆ బ్యాంకు ఉద్యోగులే చెల్లించారు. అంతేకాదు, తమ డబ్బుతోనే శశి ఇంటిని బాగుచేయించారు. బ్యాంకు ఉద్యోగుల నిర్ణయాన్ని అందరూ హర్షిస్తున్నారు. వారిపై అభినందనల వర్షం కురిపిస్తున్నారు.


More Telugu News