రష్యా సేనలకు ఎదురుదెబ్బ.. మళ్లీ ఉక్రెయిన్ అధీనంలోకి రాజధాని సమీప ప్రాంతాలు

  • 30 ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సైన్యం
  • థియేటర్ శిథిలాల నుంచి 130 మందిని రక్షించిన సైన్యం
  • దేశ సమగ్రతను పునరుద్ధరించుకునే సమయం వచ్చేసిందన్న జెలెన్‌ స్కీ
  • అర్థవంతమైన చర్చలు మాత్రమే పరిష్కారమన్న అధ్యక్షుడు
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న రష్యా సేనలు బాంబులు, క్షిపణులతో దాడులు చేస్తున్నాయి. రాజధాని కీవ్ చుట్టుపక్కల ప్రాంతాలను ఇప్పటికే తమ నియంత్రణలోకి తీసుకున్న రష్యా సేనలకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. ఆ ప్రాంతాలను ఉక్రెయిన్ సైన్యం తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది. మొత్తం 30 ప్రాంతాలను తిరిగి తమ నియంత్రణలోకి తెచ్చుకున్నట్టు ప్రకటించింది.

ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. దేశ సమగ్రతను పునరుద్ధరించుకునే సమయం ఆసన్నమైందన్నారు. సొంత తప్పుల కారణంగా జరిగిన నష్టాన్ని తగ్గించుకోవడానికి రష్యాకు ఉన్న ఏకైక మార్గం అర్థవంతమైన చర్చలేనని అన్నారు. చర్చలు ముందుకు సాగడం ఉక్రెయిన్‌కు ఇష్టం లేదన్న రష్యా ఆరోపణల నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. 

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ నుంచి 6.5 మిలియన్ల మంది వలస వెళ్లినట్టు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అలాగే, ఈ యుద్ధం 40 మిలియన్ల మందిని అత్యంత పేదరికంలోకి నెట్టేసిందని అమెరికాకు చెందిన ‘థింక్ ట్యాంక్’ అభిప్రాయపడింది. 

మరియుపోల్‌లోని ఓ థియేటర్‌పై ఇటీవల రష్యా బాంబులు ప్రయోగించడంతో అందులో చిక్కుకున్న వందలాదిమంది మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. ఆ థియేటర్‌ శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిలో 130 మందిని రక్షించినట్టు జెలెన్‌స్కీ తెలిపారు. వారిలో చాలామంది తీవ్రంగా గాయపడ్డారని పేర్కొన్నారు. కాగా, మృతులకు సంబంధించి స్పష్టమైన వివరాలు లేవు.


More Telugu News