'ది కశ్మీర్ ఫైల్స్' సినిమా డైరెక్టర్ కి 'వై' కేటగిరీ భద్రతను కల్పించిన కేంద్రం

  • కశ్మీరీ పండిట్ల ఊచకోత కథాంశంగా చిత్రం
  • డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రికి దుష్టశక్తుల నుంచి పొంచి ఉన్న ముప్పు
  • సీఆర్పీఎఫ్ బలగాలతో 'వై' సెక్యూరిటీ కల్పించిన కేంద్ర హోం శాఖ
1990లో కశ్మీరీ పండిట్లపై జరిగిన ఊచకోతను కథాంశంగా తీసుకుని తెరకెక్కించిన 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం ఘన విజయం సాధించింది. కేవలం రూ. 3 నుంచి 4 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి రూ. 200 కోట్ల దిశగా అడుగులు వేస్తోంది. ఆ రోజుల్లో కశ్మీరీ పండిట్లు అనుభవించిన నరకాన్ని ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. సినిమాను చూసినవాళ్ల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. మరోవైపు, ఎంతో ధైర్యంగా చిత్రాన్ని తెరకెక్కించారంటూ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 

ఇదిలావుంచితే, వివేక్ అగ్నిహోత్రికి దుష్టశక్తుల నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశం ఉండటంతో.. కేంద్ర హోం శాఖ ఆయనకు 'వై' కేటగిరీ భద్రతను కేటాయించింది. దేశంలో ఆయన ఎక్కడకు వెళ్లినా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రతను కల్పిస్తారు. ఇప్పటికే బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కు 'వై' కేటగిరీ భద్రత ఉన్న సంగతి తెలిసిందే.


More Telugu News