భారత్ మిసైల్ మిస్ ఫైర్.. పోటీగా క్షిపణి ప్రయోగించి నవ్వులపాలైన పాకిస్థాన్.. ఇదిగో వీడియో

  • పాక్ లోని ఆలియాబాద్ లో ఘటన
  • ఆకాశంలో పొగలు కక్కుతూ నేలకూలిన క్షిపణి
  • భయాందోళనలకు గురైన స్థానికులు
  • రేంజ్ టెస్టింగ్ కోసమే పరీక్షలన్న ఆ దేశ రక్షణ శాఖ విశ్లేషకులు
రెండు రోజుల క్రితం.. భారత్ క్షిపణి ఒకటి పొరపాటున ఫైర్ అయి పాకిస్థాన్ భూభాగంలో పడిన సంగతి తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. అది పొరపాటున జరిగినదని భారత్ కూడా విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే, పాకిస్థాన్ ఇప్పుడు దానికి పోటీగా ఓ క్షిపణిని ప్రయోగించి నవ్వుల పాలైంది. 

పాకిస్థాన్ లోని సింధ్ రాష్ట్రంలో ఉన్న జంషోరోకు సమీపంలోని ఆలియాబాద్ లో ఓ గుర్తు తెలియని వస్తువు పొగలు కక్కుకుంటూ నేలకూలింది. కిందపడిన ఆ వస్తువు క్షిపణి అని తర్వాత తేల్చారు. దీంతో అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆకాశంలో ఆ క్షిపణి పొగలు కక్కుతూ వస్తుండడాన్ని కొందరు వ్యక్తులు వీడియో కూడా తీశారు. 

పాకిస్థాన్ కు చెందిన కొన్ని మీడియా సంస్థలు దీనిపై కథనాలనూ ప్రసారం చేశాయి. అయితే, పొరపాటున భారత్ నుంచి మిస్ ఫైర్ అయిన మిసైల్ కు పోటీగా.. పాకిస్థాన్ కావాలనే ఇప్పుడు క్షిపణి ప్రయోగం చేసి ఉంటుందని, అదికాస్తా మిస్ ఫైర్ అయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మీడియాలో లేనిపోని కథనాలు వస్తున్నాయని పాకిస్థాన్ రక్షణ శాఖ విశ్లేషకులు తెలిపారు. క్షిపణి రేంజ్ తెలుసుకునేందుకు బలగాలు పరీక్షలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. దానికి సంబంధించి ముందు జాగ్రత్త చర్యలనూ జారీ చేశామని తెలిపారు.  

వాస్తవానికి నిన్న ఉదయమే ఈ ఘటన జరిగింది. ఉదయం 11 గంటలకు క్షిపణి ప్రయోగం చేయాలనుకున్నా.. క్షిపణిని ప్రయోగించే వ్యవస్థలోని ఎరెక్టర్ లో లోపం కారణంగా గంటపాటు వాయిదా వేసినట్టు అక్కడి మీడియా కథనాలు పేర్కొన్నాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రయోగం చేసినట్టు చెప్పాయి. ప్రస్తుతం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.



More Telugu News