ఎప్పుడో ఒకప్పుడు సెహ్వాగ్ చెంప పగులగొడతా: షోయబ్ అక్తర్

  • తన్మయ్ భట్ కామెడీ షోలో సరదా వ్యాఖ్యలు
  • కొందరు కమెడియన్లతో చిట్ చాట్
  • షేన్ వార్న్ తో చాలా మధురానుభూతులున్నాయని వెల్లడి
  • వసీం అక్రం, షేన్ వార్న్, సచిన్ ఆల్ టైం గ్రేట్ అంటూ ప్రశంస
మైదానంలో వాళ్లిద్దరూ ఎదురుపడ్డారంటే అంతే. బుల్లెట్ల లాంటి షోయబ్ అక్తర్ బంతులకు.. రాకెట్ లాంటి జవాబిస్తాడు సెహ్వాగ్. మైదానంలోనే కాదు.. బయట కూడా అంతే. ఈ రావల్పిండి ఎక్స్ ప్రెస్ ఇచ్చే పంచ్ లకు.. సెహ్వాగ్ వేసే కౌంటర్లు అదుర్స్ అనేలా ఉంటాయి. ఆ ఇద్దరి మధ్యా అలాంటి సరదా సంఘటనలు ఎన్నెన్నో జరిగాయి. అయితే, ఎన్ని మాటలనుకున్నా.. ఎంత ట్రోల్ చేసుకున్నా ఇద్దరూ మంచి స్నేహితుల్లాగానే ఉంటారు. 

తాజాగానూ సెహ్వాగ్ పై ఓ కార్యక్రమంలో ట్రోల్స్ చేశాడు అక్తర్. స్టాండప్ కమెడియన్స్ తో కలిసి యూట్యూబ్ లో తన్మయ్ భట్ నిర్వహించిన చిట్ చాట్ లో అక్తర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను అతడు పంచుకొన్నాడు. అయితే, చివరకు ఏదో ఒక రోజు సెహ్వాగ్ చెంప పగులగొడతానంటూ అతడు నవ్వుతూ కామెంట్ చేశాడు.   

అంతేకాదు.. లారా గురించి కూడా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓసారి వెస్టిండీస్ తో మ్యాచ్ సందర్భంగా లారా డ్రెస్సింగ్ రూంకు వచ్చాడని, బంతులతో చంపేస్తావా ఏంటి? అంటూ తనను సరదాగా అడిగాడని చెప్పుకొచ్చాడు. షేన్ వార్న్ తో తనకు ఎన్నెన్నో మధురానుభూతులున్నాయని తెలిపాడు. గొప్ప బౌలర్ అని, స్నేహానికి ప్రాణమిస్తాడని చెప్పాడు. అంత మంచి వ్యక్తి ఇంత తొందరగా వెళ్లిపోతాడనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. వసీం అక్రమ్, షేన్ వార్న్, సచిన్ క్రికెట్ చరిత్రలో గొప్ప ఆటగాళ్లని కొనియాడాడు. 

ఈ షోలోనే షోయబ్ అక్తర్ ఓ సారి కొత్త గెటప్ లో ఉన్న ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేసిన విషయాన్ని తన్మయ్ గుర్తు చేశాడు. దానికి వీరేందర్ సెహ్వాగ్ పెట్టిన కౌంటర్ కామెంట్లనూ చూపించాడు. ఆ ఫొటోకు ‘‘షోయబ్ ఆర్డర్ తీసుకో.. ఒక బటర్ చికెన్, 2 నాన్లు, 1 బీర్ పట్టుకురా’’ అని సెహ్వాగ్ కౌంటర్ ఇచ్చాడు. దానిపై స్పందించిన షోయబ్.. 'ఎప్పుడో ఒకప్పుడు సెహ్వాగ్ చెంప పగులగొడతా..' అంటూ సరదా వ్యాఖ్యలు చేశాడు. 



More Telugu News