యాక్టింగ్ నేర్చుకోమంటే ఎడిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ అని ప్రభాస్ అంటుంటాడు: రాజమౌళి

  • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఆర్ఆర్ఆర్
  • ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు
  • ఆఫ్ ద రికార్డు వీడియో పంచుకున్న చిత్రబృందం
  • రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ మధ్య ఆసక్తికర సంభాషణ
ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో దర్శకుడు రాజమౌళి ప్రమోషన్ కార్యక్రమాల స్పీడు పెంచారు. తన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఓ ప్రత్యేకమైన వీడియోను రూపొందించారు. ఈ ఆఫ్ ద రికార్డ్ వీడియోను ఆర్ఆర్ఆర్ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రధానంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య సాగిన చిట్ చాట్. 

ఎప్పుడైనా షూటింగ్ సమయంలో ఒన్ మోర్ టేక్ లు చెప్పినప్పుడో, లేక షూటింగ్ ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్లీ రమ్మన్నప్పుడో కాకుండా, మీకు పీకల్దాకా నాపై కోపం వచ్చిన సంఘటనలు ఇంకేమైనా ఉన్నాయా? అంటూ రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను అడిగారు. వెంటనే ఎన్టీఆర్ అందుకుని 'నాకు కోపం వచ్చింది ఓసారి... కానీ చెప్పను' అని అన్నాడు. 'ఏం పర్లేదు చెప్పండి' అంటూ రాజమౌళి అడిగినా ఎన్టీఆర్ చెప్పలేదు. 

ఇక రామ్ చరణ్ అందుకుని... ఓసారి ఒంట్లో బాగాలేదని, అయితే సెట్స్ మీద వెయ్యి మంది ఆర్టిస్టులు వెయిట్ చేస్తున్నారంటూ వెంటనే రావాలని కార్తికేయ (రాజమౌళి తనయుడు) చెప్పినప్పుడు కోపం వచ్చిందని వెల్లడించారు. దాంతో తాను కార్తికేయతో... వెయ్యిమందిని ఒక ఫ్రేములో తీసుకో, నన్ను ఇక్కడ ఒక ఫ్రేములో తీసుకుని ఎడిటింగ్ లో కలిపేయమని చెప్పాను అని రామ్ చరణ్ వివరించాడు. 

అందుకు రాజమౌళి బదులిస్తూ... "అందుకే యాక్టర్లు ఎడిటింగ్ నేర్చుకోకూడదని చెబుతుంటాను. యాక్టింగ్ నేర్చుకోరా అంటే ఎడిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ అని ప్రభాస్ చెబుతుంటాడు. నేను కూడా మీరు యాక్టింగ్ చేయమని చెబుతుంటే, మీరేమో బ్లూమ్యాట్ లో సెపరేట్ లేయర్ తీసుకోండి అంటూ ఎడిటింగ్ గురించి చెబుతుంటారు. అందుకే యాక్టర్లకు ఎడిటింగ్ గురించి ఎక్కువగా చెప్పకూడదు" అని అన్నారు. 

ఈసారి ఎన్టీఆర్ కూడా తన మనసులో మాటను బయటపెట్టాడు. రాజమౌళి ముఖంలో ఎదుటి వ్యక్తి బాధలో ఉన్నాడన్న సానుభూతి కనిపించదని ఫిర్యాదు చేశాడు. సినిమా షూటింగ్ మూడున్నరేళ్లు సాగిందన్న బాధ కూడా లేదని, కానీ నీ ముఖంలో నాకు సానుభూతి కనిపించదని అన్నాడు. దాంతో రాజమౌళి బదులిచ్చారు. 

రోజుకు కొన్ని షాట్లు పూర్తి చేయాలని ప్రణాళిక వేసుకుంటామని, కానీ ఆ షాట్లన్నీ పూర్తిచేయలేకపోతే మనసులోపల ఆందోళన బయల్దేరుతుందని తెలిపారు. ఓ ఆర్టిస్టు ఆరోగ్యం బాగాలేదని చెప్పినప్పుడు అతడి పట్ల సానుభూతి ప్రదర్శిస్తే ఆ రోజుకు అతడిపై తీయాల్సిన సీన్లను ఆపేయాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతున్న ఆ ఆర్టిస్టుతో సీన్లు తీస్తే సరిగా రావేమోనన్న బాధ కూడా లోపల పట్టి పీడిస్తుంటుందని రాజమౌళి వివరించారు. ఒక్కో షాట్ ఖర్చు రూ.5 లక్షలు అయినప్పుడు... ఏ విధంగా ఆర్టిస్టును రెస్ట్ తీసుకోమని చెప్పగలను?" అని తిరిగి ప్రశ్నించారు. అందుకే తాను ముఖంలో ఎలాంటి ఫీలింగ్ కనిపించనివ్వనని తెలిపారు.


More Telugu News