జనాలు చచ్చిపోతున్నారు.. ప్యాలస్ లో కూర్చుంటే కుదరదు: శైలజానాథ్

  • జంగారెడ్డిగూడెంలో మరణాలకు కారణాలు బయటకు రావాలి
  • అధికార యంత్రాంగం భయంతో సహజ మరణాలుగా చిత్రీకరిస్తోంది
  • మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలన్న శైలజానాథ్ 
జంగారెడ్డిగూడెంలో కల్తీ సారా వల్ల పలువురు మృత్యువాత పడటం అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తోంది. మరోవైపు నాటుసారా ఘటనపై మానవ హక్కుల కమిషన్ కు కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ మాట్లాడుతూ, జంగారెడ్డిగూడెంలో 30 మంది మృతికి గల కారణాలు బయటకు రావాలని అన్నారు. కల్తీసారాకు ఇంతమంది బలైపోయినా ఎక్సైజ్ మంత్రి ఇంతవరకు జంగారెడ్డిగూడెంను ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు. 

నాటుసారా తాగి ఎంతో మంది చనిపోతున్నారని... ముఖ్యమంత్రి జగన్ ప్యాలెస్ లో కూర్చుంటే పాలన సాగదని శైలజానాథ్ విమర్శించారు. అధికార యంత్రాంగం వత్తిళ్లకు భయపడి సహజ మరణాలుగా చిత్రీకరిస్తోందని చెప్పారు. ఈ మరణాలపై జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హైకోర్టులో పిల్ దాఖలు చేస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.


More Telugu News