ఏపీలో భానుడి భగభగలు... వేసవి ఆరంభంలోనే 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

  • రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మండుతున్న ఎండలు
  • రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు
  • విజయవాడలో 41 డిగ్రీలు
  • 44 డిగ్రీల వరకు చేరుతుందన్న వాతావరణ శాఖ
ఈసారి వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఏపీ వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం మార్చి నెలలో వేసవి ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతుండడాన్ని వాతావరణ శాఖ గుర్తించింది. 

మే నెల నాటికి ఎండలు మండిపోతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడే వడగాలులు వీస్తున్నట్టు కూడా తెలిపింది. నిన్న అత్యధికంగా గుంటూరు జిల్లా రెంటచింతల, కర్నూలు జిల్లా నంద్యాలలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, విజయవాడలో 41 డిగ్రీలకు చేరింది. 

ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది తుపానుగా మారే అవకాశం ఉండడంతో వాతావరణంలోని తేమను ఇది లాగేస్తుందని, తద్వారా రాష్ట్రంలో పొడి వాతావరణం, విపరీతమైన వేడిమి ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో మూడ్రోజుల పాటు రాష్ట్రంలో వేడి వాతావరణం కొనసాగుతుందని, ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు వెళ్లొచ్చని తాజా నివేదికలో పేర్కొన్నారు.


More Telugu News