'ఆర్ఆర్ఆర్‌'కు టికెట్ల ధరలు పెంచుకునే అవ‌కాశం ఉంద‌న్న ఏపీ మంత్రి పేర్నినాని

  • వంద కోట్ల రూపాయ‌ల‌ బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునే ఛాన్స్
  • అందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం 
  • ఇప్ప‌టికే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేశారు
  • దాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్న మంత్రి 
ఏపీలో బెనిఫిట్‌ షోలకు అనుమతి లేక‌పోవ‌డం, పెద్ద సినిమాల విడుద‌ల స‌మ‌యంలో టికెట్ల ధ‌ర‌లు పెంచే అవ‌కాశం లేక‌పోవ‌డంతో సీఎం వైఎస్‌ జగన్‌ను ఇటీవ‌ల‌ దర్శకుడు రాజమౌళి కలిసిన విష‌యం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా విడుద‌ల కానున్న నేప‌థ్యంలో దానిపై జ‌గ‌న్‌తో రాజ‌మౌళి, నిర్మాత దాన‌య్య చర్చించిన అంశంపై మంత్రి పేర్ని నాని మ‌రోసారి స్పందించారు. 

హీరోల‌ రెమ్యూనరేషన్ల అంశాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోకుండా, వంద కోట్ల రూపాయ‌ల‌ బడ్జెట్ దాటిన సినిమాలకు టికెట్‌ రేట్లు పెంచుకునేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇప్ప‌టికే ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నిర్మాతలు దరఖాస్తు చేశారని చెప్పారు. దాన్ని పరిశీలించి కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వివ‌రించారు. ఇటీవ‌ల‌ ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకే సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని ఆయ‌న అన్నారు. 

భారీ బ‌డ్జెట్ సినిమా విడుద‌లైన‌ 10 రోజుల పాటు సినిమా టికెట్ల ధరలు పెంచుకోవచ్చని అన్నారు. సాధార‌ణ‌ ప్రజలకు భారం కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. మ‌రోవైపు, ఆన్‌లైన్‌ టికెట్‌ విధానానికి టెండర్లు ఖరారయ్యాయని అన్నారు. ఇందులో రెండు కంపెనీలు పాల్గొన్నాయ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే తుది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. ఏపీలో త్వరలోనే ఈ విధానం అమల్లోకి వస్తుందని స్ప‌ష్టం చేశారు. 

ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే మ‌ళ్లీ స‌మాచారం ఇస్తామ‌ని చెప్పారు. పెద్ద సినిమా విడుద‌ల అవుతోన్న రోజే ఏదైనా చిన్న సినిమా విడుద‌ల అవుతుంటే, ఆ సినిమాను థియేట‌ర్లు ప‌క్క‌న పెట్ట‌డానికి, నిర్ల‌క్ష్యం చేయ‌డానికి వీల్లేద‌ని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగుల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌ని చెప్పారు. 



More Telugu News