ప్రాణాలు పణంగా పెట్టి చిరుతతో పోరాడి వదినను కాపాడిన యువకుడు!

  • ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఘటన
  • చిరుత మెడను పట్టుకుని కొరికిన యువకుడు
  • పంజాతో దాడిచేసినా వదలని వైనం
  • ఇరుగుపొరుగు రావడంతో పరుగులు తీసిన చిరుత  
ఓ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి చిరుతతో పోరాడి వదిన ప్రాణాలు కాపాడాడు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బిసోయి అటవీ ప్రాంతంలోని తరణ గ్రామంలో జరిగిందీ ఘటన. దశరథ్ హంసద వదిన మైనా నిన్న తెల్లవారుజామున ఇంటి పెరట్లోకి వెళ్లింది. ఆ సమయంలో అక్కడ పొంచివున్న చిరుత ఆమెపై ఒక్కసారిగా దాడిచేసింది. దీంతో ఆమె భయంతో కేకలు వేసింది. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న దశరథ్ వెంటనే పెరట్లోకి పరిగెత్తి చిరుతపై లంఘించాడు. 

దాని మెడను పట్టుకుని గట్టిగా కొరికాడు. అయినప్పటికీ అది వదలకపోగా పంజాతో అతడిపై దాడిచేసింది. బాధతో విలవిల్లాడినా చిరుత మెడను దశరథ్ వదల్లేదు. ఈ లోపు వారి కేకలు విన్న ఇరుగుపొరుగువారు అక్కడికి రావడంతో మైనాను వదిలేసి చిరుత పరుగులు తీసింది. గాయపడిన మైనా, దశరథ్‌లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడ చికిత్స పొందుతున్నారు. చిరుతతో ధైర్యంగా పోరాడి వదిన ప్రాణాలు కాపాడిన దశరథ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.


More Telugu News