త్వ‌ర‌లోనే చెబుతా!.. పార్టీ మార్పుపై కోమ‌టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి!

  • గౌర‌వం ద‌క్క‌ని చోట ఉండ‌లేను
  • ఎవ‌రి కింద అంటే వారి కింద ప‌నిచేయ‌లేను
  • త‌గిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరు చేస్తానన్న రాజ‌గోపాల్ 
కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మార‌బోతున్నాన‌ని మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ మార్పుపై త్వ‌ర‌లోనే చెబుతానంటూ బుధ‌వారం ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు కాంగ్రెస్ శ్రేణుల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

గౌర‌వం ఇవ్వ‌ని చోట ఉండ‌లేన‌ని, ఎవ‌రి కింద ప‌డితే వారి కింద ప‌నిచేయ‌లేన‌ని వ్యాఖ్యానించిన కోమ‌టిరెడ్డి.. త‌గిన వేదిక ద్వారా కేసీఆర్‌పై పోరాటం సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీ మార్పుపై త్వ‌ర‌లోనే చెబుతాన‌ని, త‌న‌ను న‌మ్మిన వారు త‌న వెంట రావ‌చ్చ‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల అసెంబ్లీలో చోటుచేసుకున్న ఓ ఘ‌ట‌న కోమ‌టిరెడ్డి అసంతృప్తికి కార‌ణమ‌న్న మాట ఆయ‌న వ్యాఖ్య‌ల్లోనే బ‌య‌ట‌ప‌డింది. ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల్లో కాంట్రాక్టుల‌న్నీ సీమాంధ్రుల‌కు ఇస్తున్నార‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి, మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మ‌ధ్య ఘాటు వ్యాఖ్య‌లు దొర్లాయి. ఈ నేప‌థ్యంలో త‌ల‌సానికి టీఆర్ఎస్ స‌భ్యులు అండ‌గా నిల‌వ‌గా.. సీఎల్పీ నేత‌గా ఉన్న మ‌ల్లు భ‌ట్టివిక్ర‌మార్క మాత్రం త‌న‌కు అండ‌గా నిల‌వ‌లేద‌ని కోమ‌టిరెడ్డి ఆరోపించారు. 

సీఎల్పీ నేత‌గా ఉన్న భ‌ట్టి త‌న‌ను వెన‌కేసుకుని రాక‌పోగా.. ఇద్ద‌రి వ్యాఖ్య‌లూ త‌ప్పేన‌ని చెప్పార‌న్నారు. ఈ కార‌ణంగా త‌న వ్యాఖ్య‌ల‌ను రికార్డుల నుంచి తొల‌గించిన స్పీక‌ర్‌.. త‌ల‌సాని వ్యాఖ్య‌ల‌ను మాత్రం అలాగే ఉంచేశార‌ని కోమ‌టిరెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేశారు. స‌భ‌లో భ‌ట్టి త‌న‌కు మ‌ద్ద‌తుగా నిలిచి ఉంటే ప‌రిస్థితి వేరేగా ఉండేద‌ని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న కార‌ణంగానే ఇప్పుడు ఆయ‌న నోట మ‌రోమారు పార్టీ మార్పు మాట వినిపిస్తోందన్న వాద‌నలు వినిపిస్తున్నాయి.


More Telugu News