ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దు.. బ్రదర్ అనిల్‌కు ఏపీ క్రిస్టియన్‌ జేఏసీ ఛైర్మన్ ప్రవీణ్ హెచ్చరిక

  • బ్రదర్ అనిల్ రాజకీయ అవతారాన్ని ఎప్పుడెత్తారో చెప్పాలి
  •  అగ్ర కులానికి చెందిన అనిల్ ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరమన్న ప్రవీణ్ 
  • తెలంగాణలో పెట్టుకున్న రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలంటూ సలహా   
ఏపీ రాజకీయాలలో ఇప్పుడు మారుమోగుతున్న పేరు బ్రదర్ అనిల్ కుమార్. ఆంధ్రప్రదేశ్ లో సీనియర్ నేతలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ సంఘాల నాయకులతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు ఆవేదనలో ఉన్నారని ఇటీవల ఆయన కామెంట్ కూడా చేశారు. 

అంతేకాదు వివేకా హత్య కేసుపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దోషులు తప్పించుకోలేరని, సీబీఐ నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఈ నేపథ్యంలో బ్రదర్ అనిల్ కుమార్ పై ఏపీ క్రిస్టియన్ జేఏసీ ఛైర్మన్ యలమంచిలి ప్రవీణ్ విమర్శలు గుప్పించారు. 

దైవ సందేశం అందించే బ్రదర్ అనిల్ రాజకీయ అవతారాన్ని ఎప్పుడెత్తారో చెప్పాలని ప్రవీణ్ అన్నారు. తెలంగాణలో పెట్టుకున్న రాజకీయ పార్టీ పనులు చూసుకోవాలని... ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దని హెచ్చరించారు. అగ్ర కులానికి చెందిన బ్రదర్ అనిల్... బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కేఏ పాల్ పతనం తర్వాత... బ్రదర్ అనిల్ ను వైయస్ రాజశేఖరరెడ్డి ప్రపంచానికి శాంతిదూతగా పరిచయం చేశారని తెలిపారు. ఏపీ రాజకీయాల్లో తల దూర్చవద్దని తాము సూచిస్తున్నామని చెప్పారు.


More Telugu News