నేడు దేవుడి ద‌య‌తో మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నాం: 'విద్యా దీవెన‌'పై జ‌గ‌న్

  • ఒక్క బ‌ట‌న్ నొక్కి దాదాపు రూ.709 కోట్లు విడుద‌ల‌
  • విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తున్న‌ట్లు చెప్పిన జ‌గ‌న్
  • 10.82 లక్షల మంది ఖాతాల్లో డ‌బ్బులు 
  • ఎవరూ చోరీ చేయ‌లేని ఆస్తి చదువన్న‌ జ‌గ‌న్
నేడు దేవుడి ద‌య‌తో మ‌రో మంచి కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుడుతున్నామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్ అన్నారు. ఈ రోజు స‌చివాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ... నేడు జగనన్న విద్యా దీవెన కింద 2021, అక్టోబర్‌-డిసెంబర్ త్రైమాసికానికి ఒక్క బ‌ట‌న్ నొక్కి దాదాపు రూ. 709 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తున్న‌ట్లు చెప్పారు. 

ఏపీలోని 10.82 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఈ డ‌బ్బులు ప‌డుతున్నాయి. ఎవరూ చోరీ చేయ‌లేని ఆస్తి చదువు అని జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా చెప్పారు. విద్య ద్వారా మాత్ర‌మే నాణ్యమైన జీవితం సాకారమవుతుందని తెలిపారు. చ‌దువుల కోసం త‌ల్లిదండ్రులు అప్పుల పాలు కాకూడ‌దని ఆయ‌న అన్నారు. అందుకే ఈ కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని జ‌గ‌న్ చెప్పారు. విద్య మాత్ర‌మే పేద‌రికాన్ని దూరం చేస్తుంద‌ని అన్నారు. 

చ‌దువుల‌కు పేద‌రికం అడ్డుకాకూడ‌ద‌ని జ‌గ‌న్ తెలిపారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, ఫీజు రీయింబర్స్ మెంట్ పై గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కలుపుకుని మొత్తం రూ.9,274 కోట్లు ఖర్చు చేశామ‌ని జ‌గ‌న్ వివ‌రించారు. ఈ విష‌యాన్ని తాము స‌గ‌ర్వంగా తెలియజేస్తున్నామ‌ని తెలిపారు. పేద విద్యార్థులు చ‌దువులు కొన‌సాగించేందుకు తాము అండ‌గా నిలుస్తామ‌ని తెలిపారు. 

ప్ర‌తి విద్యార్థి కుటుంబానికి ఒక అన్న‌గా, త‌మ్ముడిగా ఈ చెల్లింపులు చేసే కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగిస్తున్నాన‌ని జ‌గ‌న్ చెప్పారు. కాగా, జ‌గ‌న‌న్న విద్యా దీవెన ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థుల ఫీజు మొత్తాన్ని మూడు నెల‌ల‌కు ఓసారి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే.  



More Telugu News