జైలు నుంచి రాజీవ్ గాంధీ హత్యకేసు దోషి విడుద‌ల‌

  • రాజీవ్ హ‌త్య కేసులో తొలి బెయిల్‌
  • జైలు నుంచి విడుద‌లైన పెరారి వ‌ల‌న్‌
  • 30 ఏళ్ల జైలు శిక్ష త‌ర్వాత బెయిల్‌
మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో దోషిగా తేలి శిక్ష అనుభ‌విస్తున్న పెరారి వ‌ల‌న్ కాసేప‌టి క్రితం జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. త‌న‌కు బెయిల్ ఇవ్వాలంటూ పెరారి వ‌ల‌న్ దాఖ‌లు చేసుకున్న పిటిష‌న్‌పై గ‌త వారం తుది విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు అత‌డికి బెయిల్ మంజూరు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఇప్ప‌టికే అత‌డు 30 ఏళ్ల‌కు పైగా జైలు శిక్ష అనుభ‌వించాడు. 

సుప్రీంకోర్టు తీర్పుతో మంగ‌ళ‌వారం సాయంత్రం చెన్నైలోని జైలు అధికారులు పెరారి వ‌ల‌న్‌ను విడుద‌ల చేశారు. దీంతో ఈ కేసులో తొలి బెయిల్ లభించిన వ్య‌క్తిగా పెరారి నిలిచాడు. బెయిల్‌పై విడుద‌లైనా.. పోలీసుల‌కు చెప్ప‌కుండా ఎక్క‌డికీ వెళ్లేందుకు పెరారికి అనుమ‌తి లేదు. ఈ మేర‌కు పెరారి బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన బెంచ్ ప‌లు నిబంధ‌న‌ల‌ను పెట్టింది. బెయిల్‌పై విడుదలయ్యాక ప్రతీ నెలా పెరారివలన్‌ స్థానిక పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. అంతేకాదు, పోలీసుల అనుమతి లేనిదే అతని స్వగ్రామం జోలార్‌పెటాయ్‌ని వీడొద్దని సూచించింది.


More Telugu News