ముగిసిన వైసీపీఎల్పీ భేటీ.. మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ‌పై జ‌గ‌న్ ఏం చెప్పారంటే..!

  • అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో స‌మావేశం
  • రెండు గంట‌ల పాటు కొన‌సాగిన భేటీ
  • ఐదారుగురు మిన‌హా మిగతా అందరినీ తొలగింపు  
  • మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన వారికి పార్టీ బాధ్య‌త‌లు
  • జూలై 8న పార్టీ ప్లీన‌రీ
ఏపీ వ్యాప్తంగా ఆస‌క్తి రేకెత్తించిన వైసీపీ శాస‌న స‌భాప‌క్ష (వైసీపీఎల్పీ) భేటీ కాసేప‌టి క్రితం ముగిసింది. మంగ‌ళ‌వారం నాటి శాస‌న స‌భా స‌మావేశాలు పూర్తి కాగానే.. అసెంబ్లీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌ను ఉద్దేశించి సీఎం జ‌గ‌న్ సుదీర్ఘంగా ప్రసంగించారు. 2024 ఎన్నిక‌ల‌కు పార్టీని స‌న్న‌ద్ధం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ స‌మావేశం జ‌రిగింది. పార్టీని పటిష్ఠం చేయ‌డానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌తో పాటుగా మంత్రివ‌ర్గం పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పైనా జ‌గ‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

మంత్రివ‌ర్గ పున‌ర్వ్యవస్థీక‌ర‌ణ త్వ‌ర‌లోనే ఉంటుంద‌ని చెప్పిన జ‌గ‌న్‌... ప్ర‌స్తుతం ఉన్న కేబినెట్‌లోని మంత్రుల్లో ఐదారుగురు మిన‌హా మిగిలిన వారంద‌రినీ త‌ప్పించ‌నున్న‌ట్లుగా స్ప‌ష్టం చేశారు. ఖాళీ అయ్యే స్థానాల‌ను కొత్త స‌భ్యుల‌తో భ‌ర్తీ చేస్తామ‌ని కూడా ఆయ‌న చెప్పారు. మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన నేత‌ల‌కు పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గిస్తామ‌ని కూడా జ‌గ‌న్ చెప్పుకొచ్చారు. 2024 ఎన్నికల్లో పార్టీని విజ‌య‌ప‌థాన న‌డిపించేందుకు ఈ మార్పులు, చేర్పులు చేస్తున్న‌ట్లుగా జ‌గ‌న్ ప్ర‌కటించారు.

ఇక పార్టీని ఎన్నిక‌ల‌కు స‌మాయ‌త్తం చేయ‌డంలో భాగంగా ఎమ్మెల్యేలంతా క్షేత్ర‌స్థాయిలోనే ఉండాల‌ని జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. త‌మ ప‌రిధిలోని గ్రామ, వార్డు స‌చివాల‌యాల‌ను ఎమ్మెల్యేలు క్ర‌మం త‌ప్ప‌కుండా సంద‌ర్శించాల‌ని జ‌గ‌న్ సూచించారు. దీనిపై ప్ర‌తి రోజూ నివేదిక‌లు తెప్పించుకుంటాన‌ని కూడా ఆయ‌న చెప్పారు. కేడ‌ర్‌ను ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర చేయాల‌ని సూచించారు. బూత్ క‌మిటీల‌ను బ‌లోపేతం చేయాలని, బూత్ క‌మిటీల్లో మ‌హిళ‌లు సగం మంది ఉండాల్సిందేన‌ని జ‌గ‌న్ సూచించారు.

ఇక పార్టీ పున‌ర్నిర్మాణంపై మాట్లాడుతూ‌.. ఏప్రిల్‌కల్లా జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఏర్పాటు కావాలన్న జ‌గ‌న్.. కొత్త జిల్లాల వారీగా రీజినల్‌ కోఆర్డినేటర్లను నియమిస్తామని చెప్పారు. జులై 8న ప్లీనరీ నిర్వహిస్తామన్న సీఎం జగన్‌.. 26న కొత్త జిల్లాలకు అధ్యక్షులను నియమిస్తామ‌ని చెప్పారు.  


More Telugu News