తెలంగాణ అసెంబ్లీలో అరుదైన స‌న్నివేశం.. విప‌క్ష నేత‌పై సీఎం ప్ర‌శంస‌లు

  • మ‌న ఊరు- మ‌న బ‌డిపై భ‌ట్టి సానుకూల వ్యాఖ్య‌లు
  • అవే వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ భ‌ట్టికి కేసీఆర్ ప్ర‌శంస‌లు
  • భ‌ట్టికి విష‌య ప‌రిజ్ఞానం ఎక్కువ‌ని కితాబు
  • భ‌ట్టిని పార్ల‌మెంటుకు పంపాల‌ని సూచ‌న‌
ఏ చ‌ట్ట స‌భ‌లోనైనా అధికార ప‌క్షంపై విప‌క్షం దాడి, విప‌క్షంపై అధికార ప‌క్షం ఎదురు దాడి జ‌రుగుతుంది. అయితే అందుకు విరుద్ధంగా విప‌క్ష నేత‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ అధికార ప‌క్ష నేత వ్యాఖ్య‌లు చేయ‌డం దాదాపుగా చూసి ఉండం. అయితే అలాంటి అరుదైన స‌న్నివేశం తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా మంగ‌ళ‌వారం నాటి స‌మావేశాల్లో ఆవిష్కృత‌మైంది. అసెంబ్లీ‌లో విప‌క్ష నేత హోదాలో ఉన్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌పై సీఎం కేసీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. 

ఆర్థిక మంత్రి హ‌రీశ్ రావు ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్‌పై ప్రసంగించిన సంద‌ర్భంగా భ‌ట్టి మాట్లాడుతూ మన ఊరు- మన బడి కార్యక్ర‌మంపై సానుకూల వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. మంగ‌ళ‌వారం నాడు సీఎం కేసీఆర్ త‌న ప్ర‌సంగంలో ఇదే అంశాన్ని ప్ర‌స్తావించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ..  ‘భట్టి గారు మన ఊరు మన బడి మంచిది అని చెప్పారు. భట్టి గారు ఈ సారి ఓ మంచి మాట చెప్పారు. భట్టి గారికి ప్రమోషన్ ఇవ్వాలి. పార్లమెంట్ కి పంపాలి’ అని కేసీఆర్ అన్నారు. 

జాతీయ స్థాయి అంశాల‌పై భ‌ట్టి కాస్తంత గ‌ట్టిగానే కాకుండా అవ‌గాహ‌న‌తో మాట్లాడుతున్నార‌ని, అందుకే ఆయ‌న‌ను పార్లమెంట్‌కు పంపాల‌ని తాను అంటున్నాన‌ని కేసీఆర్ నవ్వుతూ వ్యాఖ్యానించారు. విప‌క్ష నేత‌పై కేసీఆర్ ప్ర‌శంస‌లు కురిపించ‌డంతో స‌భ‌లో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం క‌నిపించింది.


More Telugu News