అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో అధిక శాతం ఫ్లాప్ అవుతున్నాయి: ఏపీ మంత్రి అవంతి

  • ప‌వ‌న్ కల్యాణ్‌కు అహంభావం ఎక్కువ‌
  • రాష్ట్రానికి టూరిస్టుగా పవన్ క‌ల్యాణ్ వ‌స్తారు
  • ఆయ‌న‌ అభివృద్ధి గురించి మాట్లాడ‌డం ఏంటీ?
  • నేను ఎలాంటి వ్య‌క్తినో నాగ‌బాబుకి బాగా తెలుసు
  • ఆయ‌న‌ను అడిగి తెలుసుకోవాలన్న అవంతి 
జనసేన ఆవిర్భావ సభలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై పవన్ కల్యాణ్ విరుచుకుప‌డ్డ విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా త‌న‌పై ప‌వ‌న్ చేసిన‌ ఆరోపణలపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ కౌంట‌ర్ ఇచ్చారు. పవన్ సినిమాల్లో మాత్ర‌మే హీరో అని, తాను మాత్రం రాజ‌కీయప‌రంగా హీరోనని అవంతి వ్యాఖ్యానించారు. 

త‌న‌పై నిన్న ప‌వ‌న్ ప‌లు విమ‌ర్శ‌లు చేశార‌ని, తాను మంత్రిగా ఉండ‌డం ఏపీ దౌర్భాగ్యం అని ప‌వ‌న్ అన్నార‌ని, మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ పెట్ట‌డం కూడా ప్ర‌జ‌ల దౌర్భాగ్యం అనుకోవాలా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌శ్నిస్తా ప్ర‌శ్నిస్తా అంటూ చెప్పుకుంటార‌ని, తాను కూడా ఆయ‌న‌ను ఓ సామ‌న్యుడిగా ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు. తెలంగాణ‌లో బీజేపీతో జ‌న‌సేన‌కు పొత్తు ఉండ‌దా? అని అడిగారు. ఏపీలో మాత్ర‌మే బీజేపీతో పొత్తు ఉంటుందా? అని నిల‌దీశారు. 

తెలంగాణ‌లో టీఆర్ఎస్ తో పొత్తు, ఏపీలో బీజేపీతో పొత్తు ఉంటుందా? అని ప్ర‌శ్నించారు. పవన్ క‌ల్యాణ్ గ‌తంలో టీడీపీతో పొత్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారని ఆయ‌న నిల‌దీశారు. మళ్లీ ఇప్పుడు టీడీపీతో ఎందుకు కలుస్తానంటున్నారని ఆయన అడిగారు. బీజేపీతో పొత్తు వల్ల రాష్ట్రానికి ఏం సాధించగలిగారో ప్రజలకు పవన్ చెప్పాలని అవంతి శ్రీ‌నివాస్‌ డిమాండ్ చేశారు. 

రాష్ట్రానికి టూరిస్టుగా వచ్చే పవన్ క‌ల్యాణ్‌ అభివృద్ధి గురించి మాట్లాడ‌డం ఏంట‌ని ఆయ‌న అన్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు అహంభావం అధికంగా ఉంటుంద‌ని, అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాల్లో అధిక శాతం ఫ్లాప్ అవుతున్నాయని చెప్పుకొచ్చారు. పవ‌న్ సినిమాల్లో విజయాల కంటే ఎక్కువ పరాజయాలే ఉన్నాయని చెప్పారు. 

ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవటం తప్ప పవన్ వాస్తవాలు తెలుసుకోరా? అని అవంతి ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా గత మూడేళ్ల కాలంలో జనసేన కార్యకర్తలపై గూండాగిరి చేశానని అంటున్న పవన్ క‌ల్యాణ్‌ దానిని నిరూపించాల‌ని, అలా చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ ప‌వ‌న్ నిరూపించకుంటే రాజకీయ సన్యాసం చేస్తారా? అని అవంతి శ్రీనివాస్ సవాలు విసిరారు. తాను ఎలాంటి వ్య‌క్తినో నాగ‌బాబుకి తెలుస‌ని, తన గురించి ఆయ‌న‌ను అడిగి తెలుసుకోవాల‌ని ప‌వ‌న్ కు సూచించారు.


More Telugu News