ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌సంగాన్ని స్వాగ‌తించిన అమ‌రావ‌తి రాజ‌ధాని ఐకాస‌

  • ఏపీ రాజధాని అమరావతే అని స్ప‌ష్టం చేసిన ప‌వ‌న్
  • ప‌వ‌న్ రాజ‌ధాని ఆకాంక్ష‌ప‌రుల మ‌న‌సులను గెలుచుకున్నార‌ని ప్ర‌క‌ట‌న‌
  • ఉద్య‌మ‌కారుల్లో ధైర్యాన్ని నింపార‌ని వ్యాఖ్య‌
ఏపీ రాజధాని అమరావతే అని, రాష్ట్ర రాజధాని అమ‌రావ‌తి నుంచి ఎక్కడికీ తరలిపోయే ప్రసక్తేలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్న‌ స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన పార్టీ తొమ్మిద‌వ‌ ఆవిర్భావ సభలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై అమ‌రావ‌తి రాజ‌ధాని ఐక్య‌కార్యాచ‌ర‌ణ స‌మితి స్పందించింది. 

ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన ప్ర‌సంగాన్ని స్వాగ‌తిస్తున్న‌ట్లు చెప్పింది. స‌ర్కారుతో ఒప్పందం కుదుర్చుకున్న‌ తరవాతే రాజధాని అమరావతికి రైతులు భూములు ఇచ్చారని స్ప‌ష్టం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అమ‌రావ‌తి రాజ‌ధాని ఆకాంక్ష‌ప‌రుల మ‌న‌సులను గెలుచుకున్నార‌ని తెలిపింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట‌లు అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ ఉద్య‌మ‌కారుల్లో ధైర్యాన్ని నింపాయ‌ని పేర్కొంది. బిల్డ్ అమ‌రావ‌తి పోరాటానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌దండ‌లు ఉంటాయ‌ని తాము ఆశిస్తున్నామ‌ని తెలుపుతూ ఓ ప్ర‌క‌ట‌న చేసింది. 

అమ‌రావ‌తి రాజ‌ధానిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ దృఢ సంకల్పాన్ని అభినందిస్తున్నామ‌ని తెలిపింది.  సీఎంలు మారినప్పుడల్లా రాజధానులు మారవని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను గుర్తు చేసింది. మ‌రోవైపు, కేంద్ర మంత్రి భగ‌వ‌త్ క‌రాడ్‌ను అమ‌రావ‌తి ప‌రిర‌క్ష‌ణ స‌మితి నేత‌లు క‌లిశారు. అమ‌రావ‌తి రాజ‌ధానిలో వెంట‌నే నిర్మాణాలు చేప‌ట్టాల‌ని కోరారు. 



More Telugu News