జంగారెడ్డిగూడెం సారా మృతుల ఘటన.. బాధిత కుటుంబ సభ్యులను తీసుకెళ్లి రహస్యంగా విచారించిన అధికారులు

  • చంద్రబాబు పరామర్శకు రావడానికి ముందే తీసుకెళ్లిన అధికారులు
  • ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు విచారణ
  • అనారోగ్యంతో మృతి చెందిట్టు రాసివ్వాలని ఒత్తిడి
  • నిరాకరించిన బాధిత కుటుంబ సభ్యులు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కల్తీ సారాకు 26 మంది బలైపోయిన నేపథ్యంలో బాధిత కుటుంబాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న పరామర్శించారు. పరామర్శకు చంద్రబాబు వస్తున్న విషయం తెలుసుకున్న అధికారులు నిన్న ఉదయాన్నే జంగారెడ్డిగూడెం చేరుకుని బాధిత కుటుంబ సభ్యులను ఏలూరు తీసుకెళ్లి రహస్యంగా విచారించారు. 12 కుటుంబాలకు చెందిన వారిని గ్రామం నుంచి తీసుకెళ్లి ఏలూరు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో విచారించారు. 

జేసీ పద్మావతితోపాటు మరికొందరు అధికారులు వారి నుంచి వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు అధికారులు వారితో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం కూడా అక్కడే ఏర్పాటు చేశారు. విలేకరులు ఎవరినీ అధికారులు అనుమతించలేదు. కాగా, తమ వాళ్ల మృతికి కారణం సారా కారణం కాదని, అనారోగ్యం కారణంగానే వారు మృతి చెందారని లిఖితపూర్వకంగా ఇవ్వాలని అధికారులు సూచించినట్టు తెలుస్తోంది. 

అది విన్న బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. తాము అలా వాంగ్మూలం ఇవ్వలేమని కచ్చితంగా తేల్చిచెప్పి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా బయట ఉన్న విలేకరులు.. మీ వాళ్ల మృతికి కారణం ఏమిటని ప్రశ్నించగా సారానే కారణమని వారు సమాధానం ఇచ్చారు.


More Telugu News