హిజాబ్ వివాదంపై క‌ర్ణాట‌క హైకోర్టు తీర్పు రేపే

  • త‌ర‌గ‌తుల‌కు హిజాబ్ వ‌ద్ద‌న్న‌విద్యాల‌యం
  • క‌ర్ణాట‌క‌తో పాటు దేశ‌వ్యాప్తంగా వివాదంగా మారిన వైనం
  • క‌ర్ణాట‌క హైకోర్టులో విచార‌ణ పూర్తి
  • మంగ‌ళ‌వారం తీర్పు వెలువ‌రించ‌నున్న‌ హైకోర్టు
క‌ర్ణాట‌క‌తో పాటు యావ‌త్తు దేశాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేసిన హిజాబ్ వివాదంపై కోర్టు తీర్పు వెలువ‌డే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. త‌ర‌గ‌తుల‌కు హిజాబ్‌తో రావ‌ద్దంటూ ఓ విద్యా సంస్థ ఇచ్చిన ఆదేశంతో రేగిన ఈ వివాదం కర్ణాట‌క‌ను అల్లక‌ల్లోలానికి గురి చేసిన సంగ‌తి తెలిసిందే. కేవ‌లం ఒకే ఒక్క విద్యా సంస్థ జారీ చేసిన ఈ ఉత్త‌ర్వులు దేశ‌వ్యాప్తంగా మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌మాద‌ముందంటూ జ‌నం భ‌యాందోళ‌న‌లకు గుర‌య్యారు. వెర‌సి ఈ వ్య‌వ‌హారం క‌ర్ణాట‌క హైకోర్టు మెట్లెక్కేసింది.

ఈ వ్య‌వ‌హారంపై సుప్రీంకోర్టులో కూడా పిటిష‌న్ దాఖ‌లైనా..ప్ర‌స్తుతం ఈ వివాదంపై కర్ణాట‌క హైకోర్టు విచార‌ణ సాగిస్తున్నందున అక్క‌డ‌కే వెళ్లాల‌ని, హైకోర్టు ఇచ్చే తీర్పుపై అభ్యంత‌రం ఉంటే అప్పుడు త‌మ‌ను ఆశ్ర‌యించాల‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఈ వ్య‌వ‌హారంపై త్వ‌రిత‌గతిన విచార‌ణ పూర్తి చేయాల‌ని కూడా సుప్రీంకోర్టు హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. 

సుప్రీంకోర్టు ఆదేశాల‌తో క‌ర్ణాట‌క హైకోర్టు ఈ వ్య‌వ‌హారంపై ఇరు వ‌ర్గాల వాద‌న‌ల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న వినింది. విచార‌ణ ముగిసింద‌ని ప్ర‌క‌టించిన కోర్టు.. త‌న తీర్పును మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించింది. దీంతో రేపు హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోన‌న్న ఆస‌క్తి నెల‌కొంది.


More Telugu News