జ‌ర్న‌లిస్టుల‌కు జాగ్వార్ కార్లిస్తే.. టీఆర్ఎస్‌లో చేర‌తానంటున్న జగ్గారెడ్డి!

  • అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో టీఆర్ఎస్ నేత‌ల‌తో జ‌గ్గారెడ్డి
  • జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు, కార్లు ఇవ్వాలి
  • ఆ మ‌రుక్ష‌ణ‌మే టీఆర్ఎస్‌లోకి వ‌స్తా
  • ఓ ద‌ఫా పోటీకి దూరంగా ఉండ‌మ‌న్నా ఓకే
టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి) సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తున్నారు. త‌న సొంత పార్టీ కాంగ్రెస్‌పైనా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపైనా ఇప్ప‌టికే ప‌లుమార్లు వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన జ‌గ్గారెడ్డి.. టీఆర్ఎస్‌లో చేరిపోతారన్న ప్ర‌చారం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ ప్ర‌చారాన్ని కొట్టేసిన జ‌గ్గారెడ్డి.. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొన‌సాగుతాన‌ని ప్ర‌క‌టించారు. తాజాగా మ‌రోమారు టీఆర్ఎస్‌లో చేర‌తార‌ట క‌దా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న త‌న‌దైన శైలిలో స్పందించారు.

తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన జర్నలిస్ట్‌లకు ఇళ్లు, జాగ్వార్ కార్లు ఇస్తే.. తాను కారు పార్టీ( టీఆర్‌ఎస్‌) లోకి రావడానికి రెడీ అని జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌ర్న‌లిస్టుల ఇళ్ల గృహ ప్రవేశం కాగానే తాను టీఆర్‌ఎస్‌ పార్టీలోకి వస్తానని ఆయ‌న చెప్పారు. 

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో భాగంగా సోమ‌వారం నాడు అసెంబ్లీ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిల‌తో క‌లిసి మీడియా ప్ర‌తినిధుల‌తో మాట్లాడిన సంద‌ర్భంగా జ‌గ్గారెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాను డిమాండ్ చేసినట్లుగా జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్లు ఇస్తే ఒక టర్మ్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ కూడా చేయనని ఆయ‌న‌ అన్నారు. జ‌గ్గారెడ్డి నోట నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిపోయాయి.


More Telugu News