చైనా నుంచి సైనిక సంపత్తి సాయం కోరిన రష్యా... భారత్ కు ఆందోళన!

  • ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర
  • అత్యంత కఠినమైన ఆంక్షలు విధించిన పాశ్చాత్య దేశాలు
  • ఉక్రెయిన్ లో ఆశించిన రీతిలో ముందుకు పోలేకపోతున్న రష్యా
  • పరిస్థితులను గమనిస్తున్న అమెరికా
వామపక్ష భావజాల దేశాలు రష్యా, చైనా మిత్రులన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఉక్రెయిన్ పై దండయాత్రకు తెగించిన రష్యా తాజాగా మిత్రదేశం చైనా సాయం కోరింది. ఉక్రెయిన్ లో దాడులు ముమ్మరం చేసేందుకు వీలుగా సైనిక సామగ్రి అందజేయాలని విజ్ఞప్తి చేసింది. 

ఉక్రెయిన్ పై దాడి రష్యాకు సునాయాసం అని భావించినా, ఉక్రెయిన్ ప్రతిఘటన అసామాన్యంగా ఉంది. రష్యా వైపు భారీగా సైనికులు హతం కాగా, పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, శతఘ్నులు ధ్వంసమైనట్టు వార్తలు వస్తున్నాయి. దాంతో తలబొప్పి కట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనూహ్యరీతిలో చైనాను సాయం అడిగినట్టు రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కాగా, ఉక్రెయిన్ పై రష్యా యుద్ధభేరి మోగించినప్పటి నుంచి ప్రతి పరిణామాన్ని అమెరికా నిశితంగా గమనిస్తోంది. ఇప్పుడు పుతిన్ ఏ యుద్ధ సామగ్రిని చైనా నుంచి కోరుతున్నాడో కూడా అమెరికా గుర్తించింది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే ఉద్దేశంతో పుతిన్ భారీగా సేనలను నడిపించినప్పటికీ, కొన్నిరోజుల్లోనే ఆ సేనలకు అత్యవసరమైన ఇంధనం, ఆయుధాలు, ఆహార సరఫరాల కొరత ఏర్పడింది. ఆ సేనలు దాడులు చేయలేక, ముందుకు కదల్లేక ఉక్రెయిన్ లోని పలు ప్రాంతాల్లో నిలిచిపోయాయి. దాంతో ఉక్రెయిన్ పై ఆశించిన స్థాయిలో పైచేయి సాధించలేకపోయింది. 

ఇక రష్యా అంతటి ఆయుధ సంపత్తి ఉన్న దేశమే చైనా వైపు చూస్తున్న తరుణంలో భారత్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచంలో భారత్ కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు రష్యానే. మిగ్ యుద్ధ విమానాలు, టీ-90 ట్యాంకులు, సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానాలు... ఇంకా మరెన్నో ఆయుధ వ్యవస్థలను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసింది. ఇప్పుడు వాటి విడిభాగాలు, నిర్వహణ పరిస్థితి ఏంటన్న దానిపై సందిగ్ధత ఏర్పడింది. 

ఇప్పటికే రష్యాపై పాశ్చాత్యదేశాలు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించడంతో రష్యా వివిధ ఆయుధ వ్యవస్థల విడిభాగాలు తయారుచేయగలదా? అనే సందేహం కలుగుతోంది. ఇప్పుడు రష్యా... చైనా వైపు చూడడానికి కూడా కారణం ఇదేనని అర్థమవుతోంది.


More Telugu News