యుద్ధంతో చితికి పోతున్న రష్యా ప్రజలు.. తెగిపోతున్న ‘సామాజిక’ సంబంధాలు

  • రెట్టింపైన నిత్యావసరాల ధరలు
  • విదేశీ కంపెనీల మూత
  • వేలాది మందికి ఉపాధి నష్టం
  • సోషల్ మీడియా సేవలు బంద్
యుద్ధంతో ఉక్రెయిన్ పై రష్యా పై చేయి సాధించి ఉండొచ్చేమో కానీ.. రష్యా ప్రజలకు చెప్పుకోలేని కష్టాలు వచ్చి పడ్డాయి. ఉక్రెయిన్ ప్రజలు ఒకవైపు తినడానికి తిండి లేక అల్లాడిపోతుంటే.. భారీగా పెరిగిపోయిన ధరలతో నిత్యావసరాలను కొనుగోలు చేయలేని ఇబ్బందికర పరిస్థితులు రష్యా ప్రజలకు ఎదురవుతున్నాయి.

రష్యా దండయాత్రపై ఆగ్రహిస్తూ.. ఆ దేశంపై పాశ్చాత్య దేశాలు పెద్ద ఎత్తున ఆర్థిక ఆంక్షలు విధించాయి. విదేశీ కంపెనీలు కార్యాలయాలు, వ్యాపారాలు మూసేసి వెళ్లిపోతున్నాయి. దీంతో ఉపాధి పోయి వేలాది మంది రోడ్డున పడ్డారు. నిత్యావసరాలకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు కొండెక్కాయి. పాల ధరలు రెట్టింపు కాగా, నిత్యావసరాల ధరలు 50-100 శాతం వరకు పెరిగాయి. వాటిని కొనే స్తోమత మాత్రం సామాన్యులకు లేదు. మరోపక్క ఔషధాలకూ కొరత ఏర్పడింది. 

రష్యాపై ఆంక్షలతో అయినా దారికి తీసుకురావాలన్నది పాశ్చాత్య దేశాల వ్యూహం. అయినా పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. ఇది రష్యన్ల రోజువారీ జీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఏటీఎంల నుంచి రోజువారీ ఉపసంహరణలపై రష్యా సర్కారు ఆంక్షలు అమలు చేసింది. ఆర్థిక ఆంక్షలతో రష్యాలోని వ్యాపార సంస్థలకు ఆదాయం పడిపోయింది. దీంతో ఉద్యోగులకు వేతనాలను నిలిపివేశాయి. 

‘‘ఇది పూర్తిగా కొత్త తరహా సంక్షోభం. ఆదాయం కోల్పోయి, సంబంధాలు తెగిపోయి (సోషల్ మీడియా సహా), కుటుంబ సభ్యులు, స్నేహితులను చూసేందుకు ప్రయాణించలేక ఇలా ఎన్నింటినో కోల్పోయాం’’ అని నటాషా అనే ఓ యువతి ఆవేదనగా చేసిన పోస్ట్ ఇది. అమెరికాకు చెందిన సామాజిక మాధ్యమాల సేవలు కూడా అక్కడ కొన్ని నిలిచిపోగా, మిగిలినవీ ఆగిపోనున్నాయి. 


More Telugu News