కందికొండ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తాం: తలసాని

  • అభిమానుల చివరి చూపు కోసం ఫిలించాంబర్ లో కందికొండ మృతదేహం
  • మంత్రి తలసాని, ఎమ్మెల్యే మాగంటి, రచయిత పరుచూరి గోపాలకృష్ణల నివాళులు
  • కందికొండ ఫ్యామిలీని ఆదుకుంటామన్న మంత్రి
సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. చివరి చూపు నిమిత్తం తెలంగాణ ఫిలిం చాంబర్ లో కందికొండ మృతదేహాన్ని పెట్టారు. తలసాని సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రచయిత పరుచూరి గోపాలకృష్ణలు అంజలి ఘటించారు. 

కందికొండ మరణం చాలా బాధించిందని తలసాని అన్నారు. ఎన్నో గొప్ప పాటలు రాసిన గొప్ప కవి కందికొండ అని, ఆయన మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని తలసాని అన్నారు. కందికొండ కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఇంతకుముందే హామీ ఇచ్చినట్టు కందికొండ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. 

కొంత కాలం ఆయన కేన్సర్ తో బాధపడిన సంగతి తెలిసిందే. కీమో థెరపీ వల్ల ఆయన వెన్నెముక దెబ్బతిని కేవలం మంచానికే పరిమితమయ్యారు. చికిత్స వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ తో మొత్తం కృశించిపోయారు. నిన్న తుది శ్వాస విడిచారు. 

రవితేజ నటించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ సినిమాలోని ‘మళ్లీ కూయవే గువ్వ’ పాట ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టింది. తెలంగాణ మాండలికంలో ఆయన ఎన్నో పాటలు రాశారు. బతుకమ్మ, బోనాల పాటలకు అక్షరాలను కూర్చి తనదైన ముద్ర వేశారు.



More Telugu News