పోలవరం ప్రాజెక్టులో మరో ఘట్టం ఆవిష్కృతం

  • మొత్తం గేట్ల అమరిక పూర్తి
  • 48 గేట్లనూ పెట్టేసిన అధికారులు
  • 2020 డిసెంబర్ లో పనులు మొదలు
  • గత ఏడాది వరదల నాటికి 42 గేట్ల అమరిక
  • తాజాగా ఆరు గేట్లను పెట్టిన అధికారులు
పోలవరం ప్రాజెక్టులో మరో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. డ్యామ్ క్రస్ట్ గేట్లను అమర్చారు. ప్రాజెక్ట్ స్పిల్ వేకి మొత్తం 48 రేడియల్ గేట్ల అమరిక పూర్తయింది. 2020 డిసెంబర్ 17న గేట్ల అమరిక పనులు మొదలైన సంగతి తెలిసిందే. గత ఏడాది వరదలు వచ్చే నాటికి 42 గేట్లను అమర్చి వరదను కిందకు వదిలిన సంగతి తెలిసిందే. 

తాజాగా ఆరు గేట్ల అమరికనూ అధికారులు పూర్తి చేశారు. గేట్లకు పెట్టాల్సిన 96 హైడ్రాలిక్ సిలిండర్లకుగానూ 84 సిలిండర్లను అమర్చారు. ఆరు గేట్లకు 12 సిలిండర్లను త్వరలోనే పెట్టనున్నారు. ఆ పని పూర్తయ్యాక తాజాగా పెట్టిన ఆరు గేట్లనూ ఆపరేట్ చేసుకునేందుకు వీలుంటుంది. గేట్ల అమరికతో నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఏర్పడింది. అవసరానికి తగ్గట్టు నీటిని వాడుకుని మిగతా నీటిని కిందకు విడుదల చేసుకోవచ్చు. ఇక, గేట్లను ఎత్తేందుకు వీలుగా 24 పవర్ ఫాసెట్ లనూ అమర్చారు. 

10 రివర్ స్లూయిజ్ గేట్ల అమరిక కూడా పూర్తయింది. వాటికి 10 పవర్ ఫాసెట్లను పెట్టారు. ఇప్పటికే కాంక్రీట్ పనులూ పూర్తయ్యాయి. మొత్తంగా ప్రాజెక్టు నిర్మాణ పనులు 97 శాతం దాకా అయ్యాయి. కాగా, ఇటీవలే పోలవరం ప్రాజెక్టును కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహకరిస్తామని, ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.


More Telugu News