కోహ్లీ, ధోనీ స్టయిల్ కాదు నాది..  నాదైన నాయకత్వాన్ని చూస్తారు: డూప్లెసిస్

  • నాయకత్వం ఎన్నో రకాలు
  • కోహ్లీ, ధోనీని అనుకరించను
  • ప్రతి ఒక్కరికీ ప్రత్యేక స్టయిల్ ఉండాలి
  • అభిప్రాయాలు వెల్లడించిన ఆర్సీబీ కొత్త కెప్టెన్
ఆర్సీబీ కొత్త కెప్టెన్ గా నియమితుడైన దక్షిణాఫ్రికా క్రికెటర్ ఫాప్ డూప్లెసిస్.. తనదైన నాయకత్వాన్ని చూపిస్తానని ప్రకటించాడు. డూప్లెసిస్ 2011 నుంచి 2021 వరకు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో భాగంగా ఉన్నాడు. మధ్యలో సీఎస్కేపై రెండేళ్లపాటు నిషేధ కాలంలో (2016, 2017) పుణె సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. కనుక ఐపీఎల్ లో డూప్లెసిస్ కు అపార అనుభవం ఉంది. దక్షిణాఫ్రికా జట్టుకు సైతం కెప్టెన్సీ సేవలను అందించాడు.

‘‘చెన్నై జట్టులో చేరిన సమయంలో కెప్టెన్సీ అంటే నాకంటూ ఒక ఆలోచన ఉండేది. కానీ, ఎంఎస్ ధోనీ నా ఆలోచనకు పూర్తి భిన్నంగా కనిపించాడు. నా సంస్కృతి దక్షిణాఫ్రికా. కొత్త వాతావరణానికి వచ్చాను. దాంతో ధోనీ నా ఆలోచనకు పూర్తి వ్యతిరేకంగా కనిపించాడు. ఎన్నో స్టయిల్స్ ఉంటాయని అప్పుడే నేను అర్థం చేసుకున్నాను. 

కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే నీకంటూ ప్రత్యేకమైన స్టయిల్ ఉండాలి. అప్పుడే వచ్చే ఒత్తిళ్లను తట్టుకోగలం. నేను విరాట్ కోహ్లీని అనుకరించను. ఎందుకంటే నేను కోహ్లీని కాదు. ఎంఎస్ ధోనీలాగా కూడా ప్రయత్నించను. నేను నేర్చుకున్న ఎన్నో అంశాలు నాయకుడిగా నా స్టయిల్ కు సాయపడతాయి. కొత్త ప్రయాణాన్ని గొప్పగా భావిస్తున్నా’’అని ఫాప్ డూప్లెసిస్ తెలిపాడు.


More Telugu News