బుల్డోజర్లు ఇప్పుడిక వేగంగా తిరుగుతాయి: యూపీ బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

  • ముస్లింలకు మేం మద్దుతుగా ఉన్నాం
  • అయినా వారు మా ఓటమి కోసం పనిచేశారు
  • ఇక మేము వారి గురించి పునరాలోచించుకోవాలి
  • యూపీ కేబినెట్ మంత్రి బల్దేవ్ సింగ్
ముస్లింలు బీజేపీకి మద్దతుగా నిలువలేదని, కనుక ఇప్పుడు బుల్డోజర్లు మరింత వేగంగా పని మొదలు పెడతాయంటూ యూపీ బీజేపీ నేత, ప్రస్తుతం దిగిపోనున్న కేబినెట్ మంత్రి బల్దేవ్ సింగ్ ఔలక్ తన వ్యాఖ్యలతో వివాదం రగిలించారు. రాంపూర్ లోని బిలాస్ పూర్ నియోజకవర్గం నుంచి ఆయన కేవలం 307 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘మేము వారికి (ముస్లింలు) మద్దతుగా నిలవాలని కోరుకున్నాం. కానీ వారు మాకు మద్దతుగా నిలవలేదు. గతంలోనూ ముస్లింలు మా వెంట లేరు. ఈ సారి కూడా అంతే. మాకు కొంచెం కూడా అవకాశం ఇవ్వలేదు. బీజేపీ ప్రభుత్వ పథకాలతో ఎక్కువ శాతం ముస్లింలు లాభపడ్డారు.

ఉచిత రేషన్, వైద్య చికిత్సలు, ఇళ్లు వారికి అందించాం. అయినా బీజేపీని ఓడించేందుకు వారు శాయశక్తులా ప్రయత్నించారు. కనుక వారి గురించి మేము ఇప్పుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది’’అని పేర్కొన్నారు. బల్దేవ్ సింగ్ వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. చూస్తుంటే భవిష్యత్తులో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తమకు దూరం అవుతాయేమోనన్న సందేహాలు కొందరు మైనారిటీ నేతల నుంచి వ్యక్తమైంది. 

మరో బీజేపీ నేత, మొరదాబాద్ ఎమ్మెల్యే రితేష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గూండాయిజం ఆమోదనీయం కాదన్నారు. ‘‘గూండాల కోసం మా దగ్గర బుల్డోజర్లు ఉన్నాయి. ఎస్పీ ముస్లింలను సాధనంగా వాడుకుంటోంది. కానీ బీజేపీ వారి పట్ల ఎప్పుడూ వివక్ష చూపలేదు. నా నియోజకవర్గంలోనూ ముస్లింలు ప్రభుత్వ కార్యక్రమాలతో లబ్ధి పొందారు’’అని చెప్పారు. 



More Telugu News