ఆ సుబ్రహ్మణ్యం.. ఈ పుష్ప.. ఇద్దరూ ఒకటేనా?: ఆరా తీస్తున్న పోలీసులు

  • ముంబై కేంద్రంగా అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థ
  • హైదరాబాద్‌లోనూ కార్యాలయం తెరిచి మోసాలు
  • ఓ బాధితుడి డీమ్యాట్ ఖాతా నుంచి రూ. 1.87 కోట్లు మాయం
  • రంగంలోకి దిగిన సీబీఐ, పోలీసు అధికారులు
అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ సంస్థ కేసులో నిందితుడైన పుష్పా సుబ్రహ్మణ్యం.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో పనిచేసిన ఆనంద్ సుబ్రమణియన్ ఒకటేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ విషయమై దృష్టిసారించిన పోలీసు, సీబీఐ అధికారులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించి ఆధారాల కోసం గాలిస్తున్నారు. షేర్ల క్రయ విక్రయాల్లో లాభాలిప్పిస్తామంటూ ముంబైకి చెందిన అనుగ్రహ్ సంస్థ.. హైదరాబాద్‌లోనూ కార్యాలయం తెరిచి ప్రజల నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసి జెండా ఎత్తేసింది.

బాధితుడు ఒకరు గత నెలలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిక్కడపల్లికి చెందిన ప్రకాశ్ తనతో రూ. 1.87 కోట్లు మదుపు చేయించి ఆ తర్వాత డీమ్యాట్ ఖాతాలు ఖాళీ చేయించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితుడు పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుగ్రహ్ స్టాక్ అండ్ బ్రోకింగ్ యజమాని పరేష్ ఖరియాతోపాటు ఎన్ఎస్‌ఈ ఉన్నతాధికారులను ఈ కేసులో సహ నిందితులుగా చేర్చారు. 

నిందితుల్లో పుష్పా సుబ్రహ్మణ్యం పేరు కూడా ఉండడం పోలీసుల్లో కొత్త అనుమానాలు రేకెత్తించింది. ఆనంద్ సుబ్రమణియన్ పేరును బాధితులు పొరపాటును పుష్పా సుబ్రహ్మణ్యంగా చెప్పారా? లేదంటే నిజంగానే ఎన్ఎస్ఈలో ఆపేరుతో ఉన్నతాధికారులు ఉన్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, కో-లొకేషన్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణతో ఆనంద్ సుబ్రమణియన్‌కు సంబంధాలున్నట్టు ఆరోపణలున్న నేపథ్యంలో పోలీసుల తాజా దర్యాప్తు ప్రాధాన్యం సంతరించుకుంది.


More Telugu News