ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా?.. మే 2 నుంచి 9వ తేదీకి మార్పు!

  • టెన్త్, ఇంటర్ పరీక్షలు ఒకేసారి నిర్వహించడం కష్టమని అభిప్రాయం
  • ప్రశ్న పత్రాల భద్రత, పరీక్షా కేంద్రాలు వంటి సమస్యలు వస్తాయంటున్న అధికారులు
  • రేపు కొత్త షెడ్యూలు విడుదల చేసే అవకాశం
  • ఒంటిపూట బడులను కూడా ముందుకు జరపనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో మే 2 నుంచి ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. జేఈఈ మెయిన్ పరీక్షల కారణంగా ఇటీవల ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో అధికారులు కొన్ని మార్పులు చేశారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరగనున్నాయి. అయితే, రెండు పరీక్షలు ఒకేసారి జరిగితే  ప్రశ్న పత్రాలకు భద్రత కల్పించడంతోపాటు, పరీక్ష కేంద్రాలు, ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని భావించిన అధికారులు పదో తరగతి పరీక్షలను మాత్రం మే 12కు జరిపారు. 

కొత్త షెడ్యూల్‌ను ప్రభుత్వ అనుమతి కోసం పంపారు. సోమవారం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షలు మాత్రం ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు జరుగుతాయి. పదో తరగతిలో ఈసారి ఏడు పేపర్లే ఉంటాయి. కాబట్టి పరీక్షకు, పరీక్షకు మధ్య ఒకటి రెండు రోజుల విరామం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

మరోవైపు, ఒంటిపూట బడుల నిర్వహణ విషయంలోనూ ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. కరోనా నేపథ్యంలో గతేడాది ఆలస్యంగా ఆగస్టులో స్కూళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో ఇప్పుడు ఒంటిపూట బడులను కూడా ముందుకు జరపాలని  ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సాధారణంగా మార్చి 15 నుంచి ఒంటిపూడ బడులు ప్రారంభమవుతాయి. అయితే, విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఏప్రిల్‌లో ఒంటిపూట బడులు ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.


More Telugu News