డబ్బుల్లేక... అమెరికాలో మూతపడనున్న ఆఫ్ఘనిస్థాన్ ఎంబసీ

  • ఆఫ్ఘన్ లో తాలిబన్ పాలన
  • ప్రపంచదేశాలు, సంస్థల నుంచి నిలిచిన సాయం
  • భారంగా మారిన దౌత్య కార్యాలయాల నిర్వహణ
  • ఆఫ్ఘన్ తిరిగి వెళ్లేందుకు ఇష్టపడని దౌత్యాధికారులు
ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ పాలన మళ్లీ మొదలయ్యాక ప్రపంచదేశాలతో సంబంధాలు చాలావరకు తగ్గిపోయాయి. ఆఫ్ఘన్ కు వివిధ దేశాలు, ప్రపంచ సంస్థల నుంచి అందాల్సిన సాయం నిలిచిపోయింది. సాయాన్ని కొనసాగించాలని తాలిబన్ ప్రభుత్వం విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నా ఆర్థిక దుస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. అందుకు ఈ పరిణామమే నిదర్శనం. అమెరికాలోని ఆఫ్ఘన్ ఎంబసీ ఇప్పుడు మూతపడే పరిస్థితికి చేరుకుంది. ఎంబసీ కార్యాలయ నిర్వాహణకు అవసరమైన నిధులు లేవు. 

వాషింగ్టన్ లో ఉన్న ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయంలో 100 మంది వరకు విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో కొందరు లాస్ ఏంజెలిస్, న్యూయార్క్ నగరాల్లో ఉన్న ఆఫ్ఘన్ కాన్సులేట్ కార్యాలయాల్లోనూ పనిచేస్తున్నారు. వీరందరూ ఆఫ్ఘనిస్థాన్ లో పౌర ప్రభుత్వం ఉన్న సమయంలో నియమితులయ్యారు. కానీ, తాలిబన్ ప్రభుత్వం వచ్చాక ఎంబసీ నిర్వాహణకు అవసరమైన నిధులు ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఉన్న నిధులు మరో వారం వరకు సరిపోతాయని, ఆపై అమెరికాలో దౌత్య కార్యాలయం నడపలేమని ఆఫ్ఘన్ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

కాగా, వారిలో చాలామంది ఆఫ్ఘనిస్థాన్ తిరిగి వెళ్లేందుకు ఇష్టపడడంలేదు. ఈ నేపథ్యంలో, వారి వీసాలు మరో నెల పొడిగించుకునేందుకు అమెరికా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ ఆర్థిక దుస్థితి చైనాలోని ఆఫ్ఘన్ దౌత్య కార్యాలయాన్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. కాబూల్ నుంచి నిధులు నిలిచిపోవడంతో బీజింగ్ లో ఆఫ్ఘన్ రాయబారి తన పదవికి రాజీనామా చేశారు.


More Telugu News