ఏపీలో రాబోయేది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మే: నాదెండ్ల మ‌నోహ‌ర్‌

  • జ‌న‌సేన ఆవిర్భావ వేడుకల‌ ఏర్పాట్ల‌లో నాదెండ్ల‌
  • న‌వ‌ర‌త్నాలు ప్ర‌జ‌ల‌కు అంద‌ని ద్రాక్ష‌లేన‌ని ‌వ్యాఖ్య 
  • సంక్షేమం పేరిట అభివృద్ధిని దూరం చేశార‌ని విమ‌ర్శ‌
ఏపీలో రాబోయేది జ‌న‌సేన ప్ర‌భుత్వ‌మేన‌ని ఆ పార్టీ రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ అన్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలపై అప్పుడే చర్చ మొద‌లైపోయిన సంగ‌తి తెలిసిందే. సీఎం జగన్ ఏ క్ష‌ణ‌మైనా త‌న‌ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ నేతలు చెబుతున్న వైనం తెలిసిందే. అదే స‌మ‌యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని అన్ని పార్టీలూ చెబుతున్నాయి. 

ఇలాంటి నేప‌థ్యంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాబోయేది జనసేన ప్రభుత్వమేన‌ని ఆయ‌న అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల‌లో నిమ‌గ్న‌మైపోయిన నాదెండ్ల శ‌నివారం మీడియాతో మాట్లాడారు. సంక్షేమం పేరుతో వైసీపీ నేత‌లు రాష్ట్రానికి అభివృద్ధిని దూరం చేశారని ఆరోపించారు. నవరత్నాలు ప్రజలకు అందని ద్రాక్షలా మిగిలాయన్న ఆయన.. ఎన్నికల కోసం హడావుడి చేసే పార్టీ జనసేన కాదన్నారు. 14న జరిగే జ‌న‌సేన‌ ఆవిర్భావ సభ రాష్ట్ర రాజకీయాలకు దిక్సూచి అవుతుందని.. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ జనసేన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారని తెలిపారు.


More Telugu News