శ్రేయాస్ సెంచరీ మిస్... తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 ఆలౌట్

  • బెంగళూరులో డే నైట్ టెస్టు
  • పింక్ బాల్ తో ఆడుతున్న టీమిండియా, శ్రీలంక
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
  • పిచ్ ను సద్వినియోగం చేసుకున్న లంక స్పిన్నర్లు
బెంగళూరులో శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. శ్రీలంక స్పిన్నర్లు సమష్టిగా సత్తా చాటడంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో టీమిండియా ఆడింది 59.1 ఓవర్లు మాత్రమే. 

టీమిండియా ఆటగాళ్లలో శ్రేయాస్ అయ్యర్ సెంచరీ చేజార్చుకున్నాడు. 92 పరుగులు చేసిన అయ్యర్ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. లంక స్పిన్నర్ జయవిక్రమ బౌలింగ్ లో భారీ షాట్ కొట్టేందుకు ముందుకు రాగా, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా స్టంపౌట్ చేశాడు. భారత ఇన్నింగ్స్ లో పంత్ 39, హనుమ విహారి 31, కోహ్లీ 23 పరుగులు చేశారు. 

లంక స్పిన్నర్లు లసిత్ ఎంబుల్దెనియ 3, ప్రవీణ్ జయవిక్రమ 3, ధనంజయ డిసిల్వా 2 వికెట్లు తీశారు. సీనియర్ పేసర్ సురంగ లక్మల్ కు ఒక వికెట్ దక్కింది.


More Telugu News