శాతవాహన యూనివర్సిటీ అమ్మాయిల హాస్టల్ వద్ద ఎలుగుబంటి కలకలం

  • వర్సిటీ క్యాంపస్ లో ప్రవేశించిన ఎలుగు
  • హడలిపోతున్న విద్యార్థులు, అధికారులు
  • అటవీశాఖ అధికారులకు సమాచారం 
  • రెండు బోనుల ఏర్పాటు
  • ఎలుగును ఆకర్షించేందుకు అరటి పళ్లతో ఎర
కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో ఓ ఎలుగుబంటి కలకలం సృష్టించింది. అమ్మాయిల హాస్టల్ వద్ద ఎలుగుబంటి కనిపించడంతో అందరూ హడలిపోయారు. యూనివర్సిటీ వెనుకభాగంలో కొద్దిపాటి అటవీప్రాంతం ఉంది. ఇందులో ఉన్న బావుల వద్దకు నీటి కోసం ఎలుగుబంట్లు వస్తుంటాయి. అయితే, ఓ ఎలుగుబంటి యూనివర్సిటీ క్యాంపస్ లోకి ప్రవేశించడంతో విద్యార్థులు, అధికారులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. 

వెంటనే స్పందించిన అటవీశాఖ అధికారులు... ఎలుగును బంధించేందుకు రెండు బోనులు ఏర్పాటు చేశారు. ఆ భల్లూకాన్ని ఆకర్షించేందుకు బోనుల్లో అరటిపళ్ల గెలలను ఉంచారు. ఎలుగును బంధించేంత వరకు బోనులకు సమీపంలోకి ఎవరూ వెళ్లొద్దని అటవీశాఖ అధికారులు స్పష్టం చేశారు. 

కాగా, అటవీశాఖ అధికారులు యూనివర్సిటీ క్యాంపస్ లో ఎలుగు అడుగుజాడలను పరిశీలించారు. బహుశా, రెండు ఎలుగుబంట్లు సంచరిస్తుండవచ్చని వారు అంచనా వేశారు. ఓ విద్యార్థిని తాను 3 ఎలుగుబంట్లను చూశానని చెప్పడంతో, అధికారులు తమ చర్యలను ముమ్మరం చేశారు.


More Telugu News