రేపే సీడ‌బ్ల్యూసీ భేటీ.. ప‌రాభవంపై స‌మాలోచ‌న‌

  • ఐదు రాష్ట్రాల్లో ఓట‌మిపై కాంగ్రెస్‌లో అసంతృప్తి
  • నిర‌స‌న గ‌ళం విప్పిన సీనియ‌ర్లు
  • సీడ‌బ్ల్యూసీ భేటీకి ఏఐసీసీ ఏర్పాట్లు
ఇటీవ‌లే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. మిగిలిన ఐదు రాష్ట్రాల విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే.. త‌న పాల‌న‌లో ఉన్న పంజాబ్‌లో సైతం ఆ పార్టీకి ఘోర ప‌రాభ‌వం ఎదురైన సంగ‌తి తెలిసిందే. ఎన్నిక‌ల్లో ఆ పార్టీకి చెందిన సీఎం చ‌ర‌ణ్ జిత్ సింగ్ చ‌న్నీ రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోగా.. పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ కూడా ఓట‌మిపాల‌య్యారు. 

ఇక తాను దాదాపుగా గెంటేసిన మాజీ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ కూడా ఓట‌మిపాలు అయ్యారు. మొత్తంగా కాంగ్రెస్‌కు చెందిన హేమాహేమీల‌ను పంజాబీలు మ‌ట్టి క‌రిపించారు. ఇక యూపీలో స్వ‌యంగా ప్రియాంకా గాంధీ ప్ర‌చారం చేసినా..రాహుల్‌, సోనియా గాంధీల నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ అభ్య‌ర్థులు ఓడిపోయారు.

అన్నింటా ఓట‌మి నేప‌థ్యంలో...ఈ ఓట‌మికి బాధ్యులు ఎవ‌రు అంటూ పార్టీ సీనియ‌ర్లు కాస్తంత గ‌ట్టిగానే గ‌ళం విప్పారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి గులాం న‌బీ ఆజాద్ స్వరం రీసౌండ్ ఇచ్చింది. ఫ‌లితంగా సీడ‌బ్ల్యూసీ స‌మావేశాన్ని ఏర్పాటు చేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంది. అది కూడా అత్య‌వ‌స‌రంగానే. ఆదివారం సీడ‌బ్ల్యూసీ స‌మావేశం జ‌ర‌గ‌నుంద‌ని కాసేప‌టి క్రితం ఏఐసీసీ నుంచి ఓ ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాల‌యంలో జ‌రిగే సీడ‌బ్ల్యూసీ భేటీలో పార్టీ ఓట‌మికి గ‌ల కార‌ణాలపై పార్టీ చ‌ర్చించ‌నుంది.


More Telugu News