కశ్మీరీ పండిట్లపై మారణహోమం ఆధారంగా ‘కశ్మీర్ ఫైల్స్’.. సినిమా చూసి ఏడ్చేస్తూ డైరెక్టర్ కాళ్ల మీద పడిన మహిళ.. ఇదిగో వీడియో

  • వీడియోను ట్వీట్ చేసిన సురేశ్ రైనా
  • న్యాయం కోసం గొంతెత్తాలంటూ కామెంట్
  • సినిమాకు హర్యానా పన్ను మినహాయింపు
కశ్మీర్ మారణహోమాన్ని తెరపై చూపించి కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి. ‘కశ్మీర్ ఫైల్స్’ పేరిట ఆ సినిమాను నిన్న థియేటర్లలోకి విడుదల చేశారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, దర్శన్ కుమార్, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 1990ల్లో కశ్మీరీ పండిట్లపై జరిగిన అకృత్యాలు, హత్యాకాండలను సినిమాలో చూపించారు. 

అయితే, అందరి నుంచి సినిమా ప్రశంసలను అందుకుంటోంది. ఇప్పటికే హర్యానా ప్రభుత్వం పన్ను మినహాయింపునిచ్చింది. దానికి డైరెక్టర్ అగ్నిహోత్రి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా కాలంలో ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న తమకు పన్ను రూపంలో మినహాయింపులను ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. 

అయితే, సినిమా చూసిన ప్రేక్షకులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఓ మహిళ సినిమా చూసిన అనంతరం డైరెక్టర్ అగ్నిహోత్రి కాళ్లపై పడిపోయారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆమెను పైకిలేపిన వివేక్ అగ్నిహోత్రి.. ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆమె ఆయనపై పడి బోరున విలపించింది. చాలా బాగా సినిమా తీశారంటూ మెచ్చుకుంది. ఆ తర్వాత నటుడు దర్శన్ కుమార్ నూ పట్టుకుని ఆమె ఏడ్చేసింది. దీంతో దర్శన్ కూడా కళ్ల నిండా నీళ్లు నింపుకున్నారు. 

ఆ వీడియోను సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ‘‘ఇదిగో కశ్మీర్ ఫైల్స్ సినిమా వచ్చేసింది. ఇది మీ సినిమా. మీ మనసును హత్తుకునే సినిమా ఇది. న్యాయహక్కు కోసం అందరూ గొంతెత్తాల్సిన అవసరం ఉంది. కశ్మీర్ ఊచకోతల బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని పేర్కొంటూ వివేక్ అగ్నిహోత్రి, అనుపమ్ ఖేర్, ఆదిత్యరాజ్ కౌల్ లను ట్యాగ్ చేశాడు.


More Telugu News